Wednesday, April 17, 2024
HomeTrending NewsG.O.111: రద్దు వెనుక భారీ కుంభకోణం - రేవంత్ రెడ్డి

G.O.111: రద్దు వెనుక భారీ కుంభకోణం – రేవంత్ రెడ్డి

జీవో 111 రద్దు వెనుక ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని భారీ కుంభకోణం దాగి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణం విలువను లెక్కించడానికి ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీసుకున్న జీవో 111 రద్దు నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుందన్నారు. పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఆగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరబాద్ విధ్వంసం మొదలైందన్నారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారు చేసుకున్నారని ఆరోపించారు. 111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిదన్నారు. హిరోషిమా నాగసాకి లాగా హైదరాబాద్‌ను తయారు చేస్తున్నారన్నారు.
జీవో 111 రద్దు వెనుక సోమేష్ కుమార్, అర్వింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ దుష్టచతుష్టం పాత్ర ఉందని ఆరోపించారు. .సోమేశ్ కుమార్,అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణం.సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ ను అమరవీరుల స్థూపం వద్ద కట్టేసి కొట్టినా తప్పు లేదన్నారు. హైదరాబాద్ చెరువులన్నీ మాయం అయ్యాయని.. నీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇల్లు కడుతున్నారన్నారు. రాసుకొరా సాంబ అని కేసీఆర్ చెప్పగానే అరవింద్ వచ్చి రాసుకుంటారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జీవో పరిధిని పరిరక్షించేందుకు సోమేశ్ కుమార్ నేతృత్వంలోని నియమించిన కమిటీనే..ఇప్పుడు ఆ జీవో ను రద్దు చేయమని నివేదిక ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తరపుని నిజనిరార్ధణ కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ జీవో 111 పరిధిలోని గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని, పర్యావరణ వేత్తలతో చర్చించి ఒక సమగ్రమైన నివేదికను ఇస్తుంది. దాని ఆధారంగా జీవో 111 రద్దు భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

111 జీవోను కేవలం జంటనగరాలకు సంబంధించిన మంచి నీటి సరఫరాకు సంబంధించిన చిన్న అంశంగా మాత్రమే చూపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. కేసీఆర్ మాఫియా వ్యవవస్థను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ధనదాహం కోసమే 111 జీవో రద్దు చేసి జంటనగరాలపై బాంబు వేశాడని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన బినామీల కోసమే 111జీవో ను రద్దు చేశారన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన భూ లావాదేవీలను బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు.
పీజేఆర్ పోరాటం వల్లే కృష్ణా జలాలు హైదరాబాద్ కు వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ హయాంలో గోదావరి జలాలు వచ్చాయని రేవంత్ తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను విధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు. గతంలోనే రూపాయి ఖర్చు లేకుండా పైపు లైన్లు వేశామన్న కేసీఆర్ ఇప్పుడు పైపుల కంపెనీల దగ్గర కమిషన్ల కోసమే కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు.
జీవో 111 రద్దు చేసే ముందు దానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. 1908 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షం కురిసి మూసీ నది వరదలతో ఉప్పొంగింది. పురానాపూల్బ్రిడ్జి మీద సుమారు12 ఫీట్ల ఎత్తుపై నుంచి వరద ప్రవహించింది. అప్పటి లెక్కల ప్రకారం సుమారు ఇరవై కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పరిస్థితిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా వరదల నివారణకు మూసీ ఉప నది ‘ఈసా’ పైన ఒక రిజర్వాయర్ను, మూసీ నదిపైన మరొక రిజర్వాయర్ను నిర్మించాలని చెప్పారు. ఆ సూచనల ప్రకారం నిజాం ప్రభుత్వం1912లో ఉస్మాన్ సాగర్ నిర్మాణం ప్రారంభించి1920లో పూర్తి చేసింది. ఈసా నదిపై 1920లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించి 1927లో పూర్తి చేసింది. ఈ రిజర్వాయర్ల ద్వారా హైదరాబాద్ మహా నగరానికి తలాపున గ్రావిటీ ద్వారా నగరానికి కావాల్సిన నీళ్లను ఏ ఖర్చూ లేకుండా సరఫరా చేయవచ్చు. కేవలం ఒకే ఒక్క కలం పోటుతో అటువంటి ప్రాధాన్యత ఉన్న జంట జలాశయాలను మనగడను ప్రమాదంలో పడేసే పనికి కేసీఆర్ పూనుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
జంట జలాశయాల పరిధిలో నిర్మాణాలు, పరిశ్రమల కార్యకలాపాలు పెరగడంతో వాటిని రక్షించేందుకు 1996లో 111 జీవోను ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిరక్షణలో భాగంగా పది కి.మీ విస్తీర్ణంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దన్న ఉద్దేశంతో 1996 మార్చి 8న ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. పది కి.మీ పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో 192ను తీసుకొచ్చారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో జంట జలాశయాల పరిరక్షణ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీం తీర్పుకు అనుగుణంగా జలాశయాలను పరిరక్షించడానికి 111 జీవోను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు రేవంత్ రెడ్డి. 84 గ్రామాలను బయో కన్సర్వేషన్ జోన్ లో పెట్టారు అన్నారు.
హైదరాబాద్ ను పాలించిన నిజాం రాజులు, సికింద్రాబాద్ ను నిర్మించిని బ్రిటీష్ పాలకులు, సైబరాబాద్ వంటి కొత్త నగరాన్ని నిర్మించిన సమైక్య పాలకులు కూడా జోవో 111 పరిధి జోలికి వెళ్లలేదు. కానీ కేసీఆర్ మాత్రం ధన దాహం కోసం 111 జీవో రద్దు వంటి అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫలితంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

111 జీవో రద్దుతో హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్నారు రేవంత్ రెడ్డి. 111 జీవో రద్దు వెనక కుట్ర ఉందన్నారు. 111 పరిధిలో కేటీఆర్, కవిత, హారీష్ రావు, దామోదర్ రావు, రంజిత్ రెడ్డి వంటి నేతలకు ఫామ్ హౌసులున్నాయి. 2019 తర్వాత బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. ఫలితంగా ఆ ప్రాంతంలో 80 శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లాయి. ఈ తంతగం ముగిసిన తర్వాత 111 జీవోను కేసీఆర్ రద్దు చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జీవో 111 రద్దు వెనక లక్షల కోట్ల కుంభకోణం దాగుంది. బందిపోట్లను, దావూద్ నైనా క్షమించవచ్చు…. కానీ కేసీఆర్, కేటీఆర్ ను క్షమించ కూడదు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ దోపిడీలో వాటా లేకపోతే కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది కాబట్టే బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టకుండా చోద్యం చూస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిత్యం కేసీఆర్ అవినీతిపై వ్యాఖ్యానించే బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్ర సంస్థలకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను ప్రశ్నించారు. జంటనగరాలకు సంబంధించి కిషన్ రెడ్డి కూడా ఒక ఎంపీనే కదా. కిషన్ రెడ్డి మీకు బాధ్యత లేదా అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బినామీ చట్టం ఇక్కడ పూర్తిగా సరిపోతుంది కాబట్టి బీజేపీ నేతలు రంకెలు వేయడం మాని విచారణ ఆదేశించాలని కేంద్రం పై ఒత్తిడి తేవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేయడానికి ఎక్కడికి రావడానికైనా సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ కు రాజకీయ విలువలు లేవు: రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు రాజకీయ విలువలు లేవని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పార్టీ కోసం స్థలం కేటాయిస్తే..కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు అవసరం లేదంటూ గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేశారన్నారు రేవంత్ రెడ్డి. కోకాపేటలో రూ. 600 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ. 40 కోట్లకే ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ పేరిట తమ పార్టీ కార్యాలయం కోసం కేసీఆర కేటాయించుకున్నారు. టీఆర్‌ఎస్ కు గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో బంజారాహిల్స్‌లో భూమిని కేటాయించారు. అది సరిపోదన్నట్లు హైదరాబాద్ లో మరో ఎకరం స్థలం కొట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీ మోదీ కేసీఆర్ కు పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని నజరానా ఇచ్చారు. దీంతోపాటు 33 జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. 50 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం లేదు. గాంధీభవన్లో అద్దెకు ఉంటోందన్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ భవన్ పక్కన హౌజింగ్ బోర్డు 5100 చదరపు అడగులు స్థలాన్ని కేటాయించింది. ఇందుకోసం అప్పటి రేటు ప్రకారం కాంగ్రెస్ పార్టీ డబ్బులు కూడా చెల్లించింది. అయితే ఆ స్థలం తమది అంటూ భీంరావ్ వాడ బస్తీలోని కొంత మంది క్షత్రీయ సంఘాలు ఆందోళన చేశాయి.

దీంతో ఈ అంశం హై కోర్టుకు చేరింది. ప్రభుత్వం సరిగ్గా వాదించకపోవడంతో హైకోర్టుకు క్షత్రియ సంఘాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై హౌజింగ్ బోర్డు సుప్రీం కోర్టుకు వెళ్లింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు అవసరం లేదంటూ 2016లో సుప్రీంకోర్టులో కేసీఆర్ కేసు ఉపసంహరించుకున్నారు. ప్రత్యామ్నాయంగా మా పార్టీకి భూమి ఇవ్వరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు? కేసీఆర్ కు ఎకరంపైన బంజారాహిల్స్ లో బీఆరెస్ కు భూమి కేటాయించాము. ఇదేనా కేసీఆర్ రాజకీయ విజ్ఞత అన్నారు. మా 5100 గజాలు మా పార్టీకి కేటాయించాలి. మా పార్టీకి రావాల్సిన భూమి ఇవ్వకుండా నువ్వు 11 ఎకరాలు నీ పార్టీకి కేటాయించుకోవడం దుర్మార్గమన్నారు. భూమి కోసం చెల్లించిన మా డబ్బులు ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. మా పార్టీ కార్యాలయానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వమని త్వరలో సీఎస్ కలిసి కోరాతమని రేవంత్ రెడ్డి అన్నారు. భీంరావ్ వాడ భూమిని పేదలకు పంచితే తమకు అభ్యంతరం లేదన్నారు రేవంత్ రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్