Sunday, January 19, 2025
Homeజాతీయంయూపీలో కాంగ్రెస్.. సమాజ్ వాదీ చెట్టాపట్టాల్

యూపీలో కాంగ్రెస్.. సమాజ్ వాదీ చెట్టాపట్టాల్

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. రాష్ట్రంలో బిజెపిని ఒంటరిగా ఎదుర్కోవటం దుర్లభమని గుర్తించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పొత్తుకు సిద్దం అయ్యారు. పొత్తులో భాగంగా యూపీలో 17 ఎంపీ సీట్ల‌ను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఇండియా విప‌క్ష కూట‌మిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తాయ‌ని అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు.

80 లోక్‌స‌భ స్థానాలున్న యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయ‌బోతోంది. మైనారిటీలు అధికంగా ఉండే మొరాదాబాద్ ఎంపీ సీటు కావాల‌ని కాంగ్రెస్ ప‌ట్టుబ‌ట్టింది. అందుకు ఎస్పీ అంగీక‌రించ‌లేదు. మొరాదాబాద్ సీటు కేటాయించ‌ని ప‌క్షంలో సీతాపూర్, శ్రావస్తి, వార‌ణాసి స్థానాలు ఇవ్వాల‌ని కాంగ్రెస్ కోర‌డంతో చ‌ర్చ‌లు ముందుకు సాగాయి.

అమేథి, రాయ్ బ‌రేలి, ప్ర‌యాగ్‌రాజ్, వార‌ణాసి, మ‌హారాజ్‌గంజ్, దేవరియా, బన్స్‌గావ్, సీతాపూర్, అమ్రోహా, బులంద్‌ష‌హర్, ఘ‌జియాబాద్, కాన్పూర్, ఝాన్సీ, బారాబంకీ, ఫ‌తేపూర్ సిక్రీ, సహరాన్‌పూర్‌, మ‌థుర నియోజ‌క‌వర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయ‌నుంది. త్వ‌ర‌లోనే ఎస్పీ – కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ‌కులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పొత్తుల‌పై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

ఇరు పార్టీల మ‌ధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ కీల‌క పాత్ర పోషించారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటుపై రెండు, మూడు రోజులుగా సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. అధిక స్ధానాల‌కు కాంగ్రెస్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో సీట్ల స‌ర్దుబాటులో జాప్యం నెల‌కొంది. కాంగ్రెస్‌, ఎస్పీ మ‌ధ్య పొత్తు ఖ‌రారు కావ‌డంతో రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో అఖిలేష్ యాద‌వ్ పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని BSP ఇప్పటికే ప్రకటించింది. ఎవరికి వారు పోటీ చేస్తే మళ్ళీ బిజెపి లబ్ది పొందుతుందని గుర్తించిన అఖిలేష్ కాంగ్రెస్ తో జత కట్టేందుకు సానుకూలత ప్రదర్శించారు. రెండు దఫాలుగా బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రావటం.. ఎంపి సీట్లు అధికంగా గెలుచుకోవటం జరిగింది. మూడో దఫా నిలువరించకపోతే పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కమ్ముకుంటుందని…2026 శాసనసభ ఎన్నికల్లో కష్టతరం అవుతుందని SP ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే కాంగ్రెస్ తో పొత్తు.

2017 శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా అప్పటి రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నం. అప్పుడు రాహుల్ గాంధి, అఖిలేష్ యాదవ్ ఓ విధంగా జూనియర్ రాజకీయ నాయకులుగానే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు నేతలు రాటుదేలారు. మరోవైపు RLD అధినేత జయంత్ చౌదరి బిజెపితో జత కట్టారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి గుణపాటం చెప్పాలని ఇద్దరు నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు.

2024 లోక్ సభ ఎన్నికలు రాహుల్ గాంధి, అఖిలేష్ యాదవ్ లకు కీలకంగా మారాయి. యువ నేతల ఇద్దరి కలయికతో ఇండియా కూటమి బలోపేతం, యుపిలో బిజెపికి కొంత గండి పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్