పంజాబ్ 28వ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్ని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చండీగడ్ రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు నేతలు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ హరీష్ రావత్ వెల్లడించారు. ఒకరు జాట్ సిక్కు వర్గం నుంచి హిందువుల నుంచి మరొకరు ఉంటారన్నారు.
జాట్ సిక్కు నుంచి సుఖ్ జింధర్ రంధ్వా ఉంటారు. రంధ్వా డేరా బాబా నానక్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూ వర్గం నుంచి బ్రహ్మ సింగ్ మహీంద్రా రేసులో ముందు ఉన్నారు. ఈయన పటియాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విజయ్ ఇందర్ సింగ్ల (సంగ్రూర్), అమరిందర్ సింగ్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న భరత్ భూషణ్ ఆశు కూడా రేసులో ఉన్నారు.
ఉపముఖ్యమంత్రుల పేర్లు మరి కొద్దిసేపట్లో ఖరారయ్యే అవకాశం ఉంది. పేర్లు ప్రకటిస్తే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు లేదంటే ఆ తర్వాత ఉంటుంది.
చరణ్ జిత్ ఆనందపూర్ సాహిబ్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమరిందర్ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
చన్ని కాంగ్రెస్ లో మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. మూడు సార్లు కౌన్సిలర్ గా గెలిచి రెండు సార్లు ఖరార్ పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 లో చాంకౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా గెలిచారు. 2012, 2017 లో కూడా అదే నియోజకవర్గం నుంచి గెలిచి 2015 లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.