సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం లేఖ రాశారు. 9 కీలక అంశాలపై చర్చకు సమయం కేటాయించాలని కూడా ఆమె ప్రధానిని కోరారు. ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని లేఖలో సోనియా గాంధీ ప్రస్తావించారు. అసలు ఈ సమావేశాల అజెండా ఏంటో తమకెవరికీ తెలియదని ఆమె పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను ప్రభుత్వం వెల్లడించాలని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని విపక్ష ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మహిళా రిజర్వేషన్ల బిల్లును సత్వరమే ఆమోదించాలని కూడా విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశాన్ని కూడా ప్రస్తావించాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. భోపాల్‌లో తదుపరి భేటీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి పార్టీల తొలి ర్యాలీని నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన డిన్నర్ భేటీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష పార్టీలు చర్చించాయి. అజెండా వెల్లడించకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం సరైంది కాదని భేటీ అనంతరం ఖర్గే పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్, చైనా దురాక్రమణ, కాగ్ నివేదికలు, స్కామ్‌లు, వ్యవస్ధల నిర్వీర్యం వంటి కీలక అంశాలపై చర్చను పక్కదారి పట్టించేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.