ఇరాన్ లో కరోన కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. రెండు రోజులుగా పెరుగుతున్న కేసులతో రాజధాని టెహరాన్ తో పాటు పక్క రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. టెహరాన్ తో పాటు అల్ బోర్జ్ రాష్ట్రాల్లో రోజుకు నాలుగు వందల మంది మృత్యువాత పడుతున్నారు. సుమారు ముప్పై వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో అన్ని రకాల మార్కెట్లు, సినిమా థియేటర్లు, హోటళ్ళు , షాప్పింగ్ మాల్స్ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు కరోన రోగులతో నిండిపోయాయి. రాజధాని టెహరాన్ లో భయానక వాతావరణం నెలకొంది. కొత్తగా మహమ్మారి సోకిన వారికి వైద్యం అందించటం కష్టతరంగా మారింది. ఆస్పత్రుల వద్ద ఆరు బయటే రోగులు పడిగాపులు కాస్తున్నారు. డెల్టా వేరియంట్ ఉదృతికి సరైన వైద్యం అందక గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది చనిపోతున్నారు. గల్ఫ్ దేశాల్లో అత్యధిక కేసులు ఇరాన్ లోనే నమోదవుతున్నాయి. రష్యా, చైనా దేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకున్నా అనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్ జరగటం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం దేశాల్లో వ్యాక్సిన్ పై అపోహలు ఉన్నాయి. ముస్లిం జనాభాను తగ్గించేందుకు వ్యాక్సిన్ పేరుతో అగ్ర దేశాలు కుట్ర చేస్తున్నాయని అనుమానంతో ఉన్నారు. చైనా, రష్యాలు మిత్ర దేశాలైనా ఇరానియన్లు వారి టీకాలను నమ్మడం లేదు. ముస్లీం దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో టీకా కార్యక్రమాల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ప్రజల నుంచి స్పందన రావటం లేదు.