జర్మనీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా రోజుకు ఏడూ వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్న ఒక రోజే జర్మనీలో 23,212 కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ నిబంధనలు సడలించటం, మాస్కులు తప్పని సరి కాదని ప్రభుత్వం పేర్కొనటంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే వారు తక్కువగా కనిపిస్తున్నారు.
ఈ దఫా యువత, పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయని వైద్యులు చెపుతున్నారు. స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యాలయాల మూసివేత, లాక్ డౌన్ లతో సమస్య పరిష్కారం కాదని కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవటమే పరిష్కారమని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని బెర్లిన్ లో పర్యాటకుల రాకపోకలు కూడా ఎక్కువగా ఉన్నాయని, బయట నుంచి వచ్చే వారి వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు.
జర్మనీలో ఇప్పటివరకు 55.2 మిలియన్ల ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో 66.4 శాతం జనాభాకు టీకా పంపిణీ పూర్తి అయింది. 12 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసు వారికి 40.6 శాతం వ్యాక్సినేషన్ జరిగింది.