ఒరిస్సాలోని రాయగడలో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు హాస్టల్స్ లో విద్యార్థులకు కోవిడ్ సోకటం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాయగడలోని అన్వేష వసతి గృహంలో 44 మందికి కరోనా సోకగా హతమునిగుడి వసతి గృహంలో 22 మందికి పాజిటివ్ అని తేలింది. corona సోకిన వారిలో అందరు విద్యార్థులే కావటం, వారిలో కరోనా లక్షణాలు లేకపోవటం వైద్య వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అన్వేష హాస్టల్ లో మూడు వందల మంది విద్యార్థులు ఉండగా హటమునిగుడి వసతి గృహంలో రెండు వందల వరకు ఉన్నారు.
ఈ రెండు వసతి గృహాల్లోని విద్యార్థులు రాయగడలోని తొమ్మిది పాఠశాలల్లో చదువుకుంటున్నారు. రాయగడ నుంచి మన్యం జిల్లాకు, విజయనగరం జిల్లాకు నిత్యం రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ పార్వతీపురం, కొమరాడ, బొబ్బిలి ప్రాంతాల వైద్యాదికారులను అప్రమత్తం చేసింది.
మరోవైపు దేశంలో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,05,401కు చేరాయి. ఇందులో 4,25,60,905 మంది డిశ్చార్జీ కాగా, 5,24,093 మంది మరణించారు. మరో 20,403 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 29 మంది కరోనాకు బలయ్యారని, 3410 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.95 శాతానికి పెరిగిందని చెప్పింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 190.34 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, 84.10 కోట్ల టెస్టులు నిర్వహించామని తెలిపింది. గత 24 గంటల్లో 3,36,776 మందికి పరీక్షలు చేశామని పేర్కొన్నది.
Also Read : వియాత్నంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా