సుదీర్ఘ దూరం ప్రయాణించే విమాన ప్రయాణికుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5 శరవేగంగా వ్యాప్తి చెందుతోందని, ఈ నేపథ్యంలో విమానంలో చాలా దూరం ప్రయాణం చేసేవాళ్లు మాస్క్‌లు ధరించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. ఇటీవల యురోప్‌లో XBB.1.5 వేరియంట్ కేసుల్ని గుర్తించారు. ఆ సంఖ్య తక్కువగా ఉన్నా.. జోరుగా పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఇక అమెరికాలోనూ ఇటీవల XBB.1.5 వేరియంట్ కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని డబ్ల్యూహెచ్‌వో అధికారి క్యాథరీన్ స్మాల్‌వుడ్ తెలిపారు.
గత వారం అమెరికాలో 27.6 శాతం XBB.1.5 వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్‌కు చెందిన వేరియంట్లలో XBB.1.5 చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే XBB.1.5 వల్ల ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ తారాస్థాయికి చేరుతుందా లేదా అన్న అంశం ఇప్పట్లో అంచనా వేయడం కష్టమే.