దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో అవే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 40,120 కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే కేసుల్లో 2.6 శాతం తగ్గుదల కనిపించింది. మరణాలు మరోసారి 500 దాటాయి. నిన్న మహమ్మారి ధాటికి 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.21 కోట్లు దాటగా.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,30,254 గా ఉందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నిన్న 42వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.13 కోట్లుగా ఉంది. రికవరీ రేటు 97.46 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 1.20 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,84,227 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. అలాగే నిన్న 57,31,574 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 52.95 కోట్లకు చేరింది.