Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎస్ బి ఐ వారి ఆరోగ్య సలహాలు

ఎస్ బి ఐ వారి ఆరోగ్య సలహాలు

India may witness Covid 3rd Wave :

వచ్చే నెలలో కరోన మూడో వేవ్ వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు పత్రికల్లో మొదటి పేజీల్లో వార్తలొచ్చాయి. ఎయిమ్స్, ఐ సి ఎం ఆర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కోవిడ్ ప్రభుత్వ వర్కింగ్ గ్రూపు చెబితే పొరపాటున మీడియాలో ఇలా వార్తలు వచ్చి ఉంటాయనిపించి, లోతుగా చదివితే అది ఎస్ బి ఐ కనుగొన్న విషయమే. ఆంగ్ల పత్రికల్లో ఇంకా వివరంగా ఉంది. ఎస్ బి ఐ అంటే ఆషామాషి బ్యాంక్ కాదు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్.ఎస్ బి ఐ కి కరోనతో ఏమి పని అన్నది అర్థం లేని ప్రశ్న. కరోనతో ప్రభావితమయ్యే ఎవరయినా కరోనా గురించి మాట్లాడడానికి అధికారం ఉంటుంది. నిజానికి తన పని కాకపోయినా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మూడో వేవ్ ఎప్పుడొస్తుందో కనుగొన్న ఎస్ బి ఐ ని అభినందించాలి.

ఎస్ బి ఐ స్ఫూర్తితో మిగతా బ్యాంకులు కుడా ఇలాంటి అనేకానేక సామాజిక సమస్యల మీద అధ్యయనాలు చేసి, తమ పరిశీలనలను మీడియాకు విడుదల చేస్తే ఆ వార్తలు ఇలా ఉండవచ్చు.

Covid 3rd Wave :

తూరుపు తిరిగి దండం పెట్టుకోండి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధ్యయనం ప్రకారం- కోవాగ్జిన్, కోవిషిల్డ్, స్ఫుత్నిక్, మాడేర్న, జాన్సన్ అండ్ జాన్సన్, ఆనందయ్య, పరమానందయ్య ఏది వాడినా పరవాలేదు. తాము నిరవ్ మోడీ- చొక్సిలకు పద్నాలుగు వేల కోట్లు తిరిగిరాని అప్పులిచ్చి రోజూ అరేబియా తూరుపు తిరిగి దండం పెట్టుకోవడం వల్ల సూర్యరశ్మి బాగా తగిలి విటమిన్ డి బాగా దొరికింది. బ్యాంకులో విటమిన్ ఎం అణా పైసలతో పాటు పోయినా, తూరుపు తిరిగి ప్రతి ఉదయం నమస్కారాలు చేయడం వల్ల వ్యక్తిగతంగా బ్యాంకు ఉద్యోగుల ఎముకలు బలపడ్డాయి. బ్యాంకు వెన్నెముక విరిగినా, ఉద్యోగుల ఎముకలు గట్టిపడడం ఈ అధ్యయనంలో లభించిన గొప్ప ఊరట.

నేషనలైజేషన్ అంటే జాతీయం చేయడం. బ్యాంకు సొమ్ము నీరవ్ ఒక్కడే “జాతీయం” చేయడం మాక్కూడా ఇబ్బందిగా ఉంది. ఇంగ్లీషు మాట్లాడ్డం వచ్చి, లండన్లో ఇల్లు ఉండి, పదివేల కోట్లు అప్పు తీసుకున్న ఎవరూ తిరిగి కట్టనే కట్టరని మా అధ్యయనంలో స్పష్టంగా తేలింది.

నాలుగు మాస్కులు మేలు
యాక్సిస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా జరిపిన విస్తృత అధ్యయనంలో మనిషన్న ప్రతివారూ మూతికి నాలుగు మాస్కులు పెట్టుకుంటే నీటి అడుగున రోజంతా బాల భీముడు ఊపిరిని బిగబట్టి బతికినట్లు- మనం కూడా ఊపిరిని బిగబట్టి బతకవచ్చు.

చట్టబద్ధమయిన హెచ్చరిక:-
ఇది యాక్సిస్ బ్యాంక్ నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించాల్సిన పవన బంధన ప్రాణ విద్య. బయట ఎవరూ ప్రయత్నించకూడదు.

భయమే వైరస్
యోగక్షేమం వహించాల్సిన బాధ్యత మా ఎల్ ఐ సి ట్యాగ్ లైన్లో ఉంది కాబట్టి దీపాలు ఆరిపోకుండా మేము కూడా అధ్యయనం చేశాము. భయానికే సగం చచ్చిపోయినట్లు మా అధ్యయనంలో తేలింది. సాధారణంగా మీరు పొతే పనికొస్తుందని మేము పాలసీలను లక్షల కోట్ల విలువలో అమ్మాము. ఇప్పుడు మీరు పోకూడదని కోరుకుంటున్నాము. మీరు పొతే…నెమ్మదిగా డెత్ క్లెయిమ్ ల దెబ్బకు మేము కూడా పోవాల్సి వస్తుంది.

ఎవరు ఏ పని అయినా చేయవచ్చు అన్న కోణంలో మరికొన్ని వార్తలు ఇలాంటివి కూడా పాఠకులు చదవాల్సి రావచ్చు.

వీసాలను మంజూరు చేయనున్న సీసాల శాఖ ఆబ్కారీ

విద్యా శాఖ ప్రక్షాళనకు మద్యం సొమ్ము

నదీ జలాల వివాదానికి నీటి మూటల పరిష్కారం

ఆనందయ్య షెడ్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ కార్యాలయం

హోటళ్లలో పేషంట్లు

ఆసుపత్రుల్లో రిసార్టులు

అవుటర్ చుట్టూ భూగర్భ గేటెడ్ కమ్యూనిటీలకు మత్స్యశాఖ తవ్వకాలు

బి కామ్ లో ఫిజిక్స్ ను తప్పనిసరి చేసిన ఆరోగ్యశాఖ

ప్రశాంత్ కిషోర్ డ్రైవర్ ను ఎత్తుకెళ్లిన ట్రంపు

ఐ ఐ టీ కి పాఠం చెప్పిన వేలిముద్ర

-పమిడికాల్వ మధుసూదన్

Must Read : చార్ ధాం యాత్ర పై  కరోన ప్రభావం

RELATED ARTICLES

Most Popular

న్యూస్