తెలంగాణ గవర్నర్ రాజకీయ ఉపన్యాసం ఇస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా విమర్శించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటిందని, గవర్నర్ రాష్ట్రియ స్వయం సేవక్ సంఘ్ (RSS) రాసిన రాజ్యాంగం చదివిందన్నారు. హైదరాబాద్ మగ్ధుం భవన్ లో ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన నారాయణ… గవర్నర్ వ్యవస్థ పనికిమాలినదని అన్నారు. దేశ ప్రజలు అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం చదివారని, బిజెపి వాళ్ళు RSS రాజ్యాంగం చదివారని ఆరోపించారు. గవర్నర్ కు దర్భార్ పెట్టె హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
గవర్నర్ తమిలి సై బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో బీజేపీ తరపున పోటీ చేసి ఒడిపోయిన గవర్నర్ తమిళి సై…హద్దుల్లో ఉంటే గౌరవం ఉంటుందన్నారు. విశ్వవిద్యాలయ బోర్డు బిల్లు ఆపే హక్కు గవర్నర్ కు ఎక్కడిదని… దాన్ని మరోసారి పంపితే ఆమోదించి తీరాల్సిందేనన్నారు. గవర్నర్ వ్యవస్థతో నష్టమే తప్పా లాభం లేదని నారాయణ అన్నారు. గవర్నర్ ఏ అంశమైన రాష్ట్రపతికి మాత్రమే రిపోర్టు చేయాలని, ప్రధాని, హోం మంత్రులకు నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నదని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు.
ప్రధాని మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానిగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారని, ఏండ్లు గడుస్తున్నా రాజధాని నిర్మాణం ముందుకు కదలడం లేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మిన మోదీ.. రేపు విశాఖపట్నం వస్తున్నారని, ఆయన రాకకు నిరసనగా పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నామని, నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని చెప్పారు.