Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్మానసిక స్థైర్యం కావాలి : వేద కృష్ణ మూర్తి

మానసిక స్థైర్యం కావాలి : వేద కృష్ణ మూర్తి

ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలతో సర్వస్వం కోల్పోయినట్లు అనిపించిందని భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వేద కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక స్థైర్యం అత్యంత అవసరమని, విధి రాతను తాను నమ్ముతానని చెప్పారు. మనసుకు తగిలిన గాయాలను తొందరగా మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నానని భావోద్వేగంతో వెల్లడించారు.

వేద కుటుంబంలో మొత్తం తొమ్మిది మందికి కోవిడ్ సోకింది. వీరిలో వేద తల్లి, సోదరి వారం వ్యవధిలోనే ఈ మహమ్మారికి బయల్యారు. ఈ మరణాలు ఆమెకు, కుటుంబానికి తీరని శోకం మిగిల్చాయి .

తల్లి మరణంతోనే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. అతి త్వరలో కోలుకొని తిరిగి వస్తుందనుకున్న సోదరి మరణం తనను ముక్కలు చేసిందని వేద కన్నీటి పర్యంతమయ్యారు. తాను తప్ప కుటుంబంలో అందరూ కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారని, అందరికీ కావాల్సిన వైద్య సదుపాయాలు తానే దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కనీస వైద్య సదుపాయాలు కూడా పొందలేని అభాగ్యులను తలచుకొన్నప్పుడు హృదయం ద్రవించి పోయిందని వేద అవేదన వ్యక్తం చేశారు.

మానసికంగా ధైర్యంగా ఉంటే కోవిడ్ నుంచి కోలుకోవచ్చని అర్ధం అయ్యిందని, తల్లి, సోదరి కూడా చివర్లో ధైర్యం కోల్పోయారని వేద అభిప్రాయపడ్డారు. కుటుంబంలో చిన్నారులతో సహా అందరికీ కోవిడ్ సోకడం తన తల్లిని మరింత కుంగదీసి ఉండొచ్చన్నారు.

వేద కృష్ణమూర్తి కి బిసిసిఐ నుంచి కనీస ఓదార్పు కూడా లభించలేదు, దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బిసిసిఐ కార్యదర్శి జై షా ఆమెను ఫోన్ లో పలకరించారు, బెంగుళూరు వచ్చినప్పుడు తప్పనిసరిగా కలుస్తానని హామీ ఇచ్చారు.

బిసిసిఐ నుంచి స్పందన లేకపోవడంపై మాట్లాడుతూ దీనికి తానేమీ చింతించడం లేదని, నిజానికి జై షా ఫోన్ చేసి మాట్లాడతారని అనుకోలేదని అంటూ తనను పలకరించిన వారదరికీ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్