Chinese Companies : చైనా లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్రికా దేశాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. చైనా కంపెనీలు వనరులు కొల్లగొడుతూ స్థానికుల యోగ క్షేమాలు పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మైనింగ్ రంగంలో చైనా కంపెనీలు స్థానిక చట్టాలు పట్టించుకోకుండా మానవ హక్కులు కాలరాస్తున్నాయని ఆఫ్రికా దేశాలకు చెందిన మేధావులు, సంస్థలు ఆరోపిస్తున్నారు. జింబాబ్వే దేశంలో చైనా కంపెనీలపై తిరగబడుతున్నారు. మతబెలేలాండ్ ఉత్తర ప్రావిన్స్ లోని బింగ గ్రామంలో అన్జిన్ మైనింగ్ అనే చైనా కంపెనీ గొ బ్యాక్ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ పూర్వికుల నుంచి వచ్చిన భూములను నిబధనలకు విరుద్దంగా మైనింగ్ కు తీసుకుంటున్నారని తిరగబడుతున్నారు. చైనా కంపెనీల వాహనాలపై గిరిజన తెగల ప్రజలు దాడులు చేస్తున్నారు.
జింబాబ్వే సహజ వనరులను చైనా కంపెనీలు లూటీ చేస్తున్నాయని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. గనుల తవ్వకాలతో పర్యావరణంపై ప్రభావం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటంతో ఆదివాసి ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విమర్శిస్తున్నారు. ముందుగా ఎలాంటి అధ్యయనాలు చేయకుండానే గనుల తవ్వకాలు మొదలుపెట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. సామాజిక బాధ్యత, మానవ హక్కుల ఉల్లంగన, నిబంధనలకు విరుద్దమైన తవ్వకాలు, స్థానిక ప్రజలపై అరాచకాలను పరిగణలోకి తీసుకుని చైనా కంపెనీలను బాధ్యులను చేయాలని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, నిరసనలు చేస్తున్నారు.
దీంతో చైనా – జింబాబ్వే దేశాల మధ్య దౌత్య సంబంధాలపై నీలి నీడలు కమ్ముకునే పరిస్థితి నెలకొంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషిఏటీవ్ విధానం కింద వివిధ అభివృద్ధి పనుల కోసం ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. అయితే స్థానిక ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా, ఆయా దేశాల చట్టాలకు విరుద్దంగా చైనా కంపనీలు వ్యవహరిస్తున్నాయని కొన్నాళ్ళుగా ఆఫ్రికా దేశాల్లో చైనా వ్యతిరేకత పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి: చైనా దురాగతాలపై బంగ్లాలో నిరసనలు