bamboo Crop: రాష్ట్రంలో అటవీ ప్రాంతం తోపాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు, వివిధ గుట్టపైన వెదురును పెంచేందుకు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సిఎస్ సమావేశ మందిరంలో రాష్ట్ర బ్యాంబూ మిషన్ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ను,అగరబత్తీల తయారీ ఇతర అవసరాలకు నేడు వెదురుకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుండి వెదురును దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు.బ్యాంబూ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పాటును అందించడం జరుగుతుందని తెలిపారు. కావున అటవీ ప్రాంతాలతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు, వివిధ గట్లపైన వెదురు పెంపకాన్ని చేపట్టేలా రైతులను అన్ని విధాలా ప్రోత్సహించాలని ఆదేశించారు.
ఈసమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్,వీడియో లింక్ ద్వారా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉద్యానవనశాఖ కమీషనర్ శ్రీధర్,సెర్ప్ సిఇఒ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.