తూర్పు ఆఫ్రికా దేశమైన మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. జనాలు కొట్టుకుపోతున్నారు. ఈ తుపాను ధాటికి 100కి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Cyclone Freddy : తూర్పు ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం
ఫ్రెడ్డీ తుపాను ధాటికి మలావి, మొజంబిక్ సహా పలు తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాలు అతలాకుతులం అవుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భవనాలతో పాటు చెట్లు కూలిపోయి.. కొండ చరియలు విరిగి పడటంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్ర గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.