Saturday, January 18, 2025
HomeTrending Newsవాసాల‌మ‌ర్రిలో దళితబంధు

వాసాల‌మ‌ర్రిలో దళితబంధు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తత గ్రామం వాసాలమర్రిలో తెలంగాణ దళితబందు పథకానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అంకురార్పణ చేశారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల అభవృద్ధి కోసం దళితబందు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హుజూరాబాద్ లో  దళితబందు పైలెట్ ప్రాజెక్ట్ ఇక లాంఛనమేనని సీఎం పేర్కొన్నారు. ద‌ళిత బంధు నిధుల‌ను ఒకే విడుత‌లో పంపిణీ చేస్తామ‌న్నారు. ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 30 కోట్ల‌తో ద‌ళిత ర‌క్ష‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున రూ. 7 కోట్ల 60 లక్షల రూపాయాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచే లబ్దిదారుల చేతికి సాయం అందుతుందన్నారు. దళితులంతా మార్వాడీల్లా వ్యాపారం చేసే స్థాయికి ఎదగాలన్నదే తన ఆరాటమన్నారు ముఖ్యమంత్రి.

దళిత బంధు పథకంలో దళితులదే పెత్తనమని చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వం సాయం అందించిన పది లక్షల్లో పది పైసలు కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు, బ్యాంకు లింకేజీ కూడా లేదన్నారు, వ్యాపారం చేసుకునేందుకు నిపుణులతో సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీ వేస్తామని చెప్పారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి మండలం, జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మెక్రో చిప్ ఐడీ కార్డులు అందజేస్తామని చెప్పారు.

పథకం పక్కదారి పట్టకుండా తానే కావలి ఉంటానని సీఎం తెలిపారు, ఎమ్మెల్యేలు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారని చెప్పారు. రేపటి నుంచే వాసాలమర్రిలో దళిత బంధు అమలు అవుతుందని చెప్పారు. ఆరు నెలల్లోనే జీవితాలు మారేలా ఎవరికి వారు బిజినెస్ ప్లాన్ చేసుకోవాలని..ఇంటిల్లాది కూర్చుని ఏం వ్యాపారం చేస్తే బాగుంటుందో చర్చించుకోవాలన్నారు. పైస పైసా కూడబెట్టినప్పుడు ఫలితం ఉంటదన్న సీఎం కేసీఆర్… దళితులు బాగుపడితే తానే కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుంటానని చెప్పారు. అనుకోని సమస్యలు ఎదురైనా ఇబ్బంది తలెత్తకుండా రూ. 30కోట్లతో దళిత బంధు రక్షణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం సాయం అందించే పది లక్షల్లో నుంచి పది వేలు దళిత రక్షణ నిధికి బదిలి చేస్తామన్నారు. దళిత బంధు పొందినవారికి ఎక్కడా ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కొరత ఉండదన్నారు.

అంతకు ముందు కాలినడకన దళితవాడల్లో కలియ తిరిగిన సీఎం ఊరంతా ఆగమాగం ఉందన్నారు. అందుకే ఎర్రవెల్లిలా వాసాలమర్రి గ్రామాన్ని కొత్తగా పక్కా ప్లాన్ తో నిర్మిస్తామని చెప్పారు. సకల సౌకర్యాలు ఉండేలా లేవుట్ తో కొత్త గ్రామం నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు గ్రామస్తులు కలిసిమెలసి సహకరిస్తే సరిపోతుందన్నారు. ఆర్నెళ్లలో వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిని చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామంలోని సర్కార్ మిగులు భూములను కూడా దళితులకు పంచుతామని చెప్పారు సీఎం కేసీఆర్. దళితులంతా తగాదాలు, భూమి పంచాయితీలు వదిలిపెట్టి పట్టుపట్టి, జట్టుకట్టి దళిత బంధును విజయవంతం చేసి చూపాలని చెప్పారు.

దళితులంతా కష్టజీవులని చెప్పిన సీఎం..ఇన్నాళ్లు ఎలాంటి సాయం అందకనే వెనకబడి పోయారని చెప్పారు. ఎంతో నైపుణ్యం, బిజినెస్ ఐడియాలు ఉన్నా..పెట్టుబడి లేక వెనుకబడిపోయారని…ఇప్పుడు సర్కార్ వారికి ఇన్వెస్ట్ మెంట్ చేస్తుందని చెప్పారు. ఇక దళితులంతా చేయాల్సింది వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని బతుకులు మార్చుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలన్నారు.

వాసాలమర్రి రాష్ట్రంలో దళిత బంధుకు మోడల్ అని చెప్పిన సీఎం కేసీఆర్ ఈ స్కీమ్ ను విజయవంతం చేసే బాధ్యత కూడా ఇక్కడి గ్రామస్తులపై ఉందని చెప్పారు. అందివచ్చిన అవకాశాన్ని ఆలస్యం అయినా..ఆలోచించి అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్రంలోని దళితులందరికి దళిత బంధు అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. 20 ఏండ్లుగా తెలంగాణ కోసం కొట్లాడి ఎలా సాధించామో అదే ఉద్యమ స్పూర్తితో అనతికాలంలోనే దళితుల జీవితాల్లో మార్పు కోసం కష్టపడుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.

దళితుల పేదరికానికి గత పాలకులే కారణమని చెప్పారు సీఎం కేసీఆర్. మహనీయుడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ తర్వాత అంతలా కృషి చేసిన నేతలెవరు లేరన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేస్తుంటే..కొందరు అవాకులు చెవాక్కులు పేలుతున్నారు అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్లోనే ఇలాంటి అవరోదాలు వచ్చాయని చెప్పిన సీఎం కేసీఆర్… ఆరు నూరైనా దళిత బంధును సక్సెస్ చేసి చూపుతామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్