Saturday, November 23, 2024
HomeTrending Newsరాబోయే రోజుల్లో ఇతర వర్గాలకు దళితబంధు

రాబోయే రోజుల్లో ఇతర వర్గాలకు దళితబంధు

దళిత బంధును రాబోయే రోజుల్లో ఇతర వర్గాలకు విస్తరిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరులో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంత్రి యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…దళితబంధు ఓ సామాజిక ఉద్యమమన్నారు. ఈ బడ్జెట్‌లో రూ.17800 కోట్లు దళితబంధు కోసం కేటాయించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో 2 లక్షల మందికి దళిత బంధు అందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేటు పెంచి.. సబ్సిడీ తగ్గించారని మండిపడ్డారు. ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ ధరలు పెంచుతున్నారన్నారు. బీజేపీ వాళ్ల మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని మంత్రి విమర్శించారు. మోదీ సొంత రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే విధించారన్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు 7778 మెగా వాట్ల ఉత్పత్తి ఉండేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచి కష్టపడి ప్రస్తుతం 17305 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని చేరుకున్నామని చెప్పారు. త్వరలో 4000 మెగా వాట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఆరు నెలల్లో 1600 మెగా వాట్ల సామర్ధ్యం ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అందుబాటులో వస్తుందన్నారు. మార్చి నెలలో 1200 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశామని అన్నారు. 20 రూపాయలకు ఒక యూనిట్ చొప్పున కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. దేశం మొత్తం కరెంట్ కోతల్లో ఉంటే.. తెలంగాణ విద్యుత్ వెలుగుల్లో ఉందన్నారు. దేశంలో విద్యుత్ కోతలకు కేంద్రం వైఖరే కారణమని ఆగ్రహించారు. దేశం అవసరానికి మించి విద్యుత్ అందుబాటులో ఉన్నా.. సరైన పంపిణీ వ్యవస్థ లేక కోతలు విధిస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

Also Read : వైద్యానికి బడ్జెట్ లో భారీ నిధులు: హరీష్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్