Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందాశరథీ! కవితాపయోనిధీ!- 2

దాశరథీ! కవితాపయోనిధీ!- 2

దాదాపు ఆరు దశాబ్దాలు వెనక్కు వెళదాం. బహుశా 1960 ప్రాంతాల్లో ఒక చల్లని సాయంత్రం. హైదరాబాద్ అసెంబ్లీ భవనం ఎదురుగా ఆకాశవాణి కేంద్రం. సూర్యుడు పడమట దిగబోతూ ఆకాశవాణి కేంద్రంలో పెద్ద చెట్ల కింద గాలులకు రాగాల రంగులు పూసే ఒక సంగీత సాహిత్య ప్రక్రియను చూడ్డానికి, వినడానికి పొద్దుగుంకకుండా ఆగిపోయాడు. మేఘాలను తాకి గాలి చల్లదనంతో గిలిగింతలు పెడుతోంది. మెల్లమెల్లగా వీస్తోంది.

అక్కడ తెలుగు లలితగీతాలకు అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన పాలగుమ్మి విశ్వనాథం; ఆయన ముందు కోటి రతనాల వీణ దాశరథి ఉన్నారు. దాశరథి రాయాలి. పాలగుమ్మి వరుసకట్టాలి, పాడాలి.

ఉండుండి…దాశరథిని చల్లగాలులు తాకి వెళుతున్నాయి. గాలి ఈలలు వేస్తోంది. మనల్ను చల్లగాలి తాకితే మిరపకాయ బజ్జీలు తినాలనుకుంటాం. వేడి వేడి మొక్కజొన్నపొత్తులు తినాలనుకుంటాం. వేడిగా చాయ్ తాగాలనుకుంటాం. దాశరథి మదిలో వీణలు కదిలి మోగాయి ఆ చల్లగాలులకు.

“చల్లగాలినే పిల్లనగ్రోవిగా
మెల్లమెల్లగా ఊదే స్వామీ!
ఎవరయ్యా? నీవెవరయ్యా?”
అన్న పల్లవి పల్లవించింది. పాలగుమ్మి పాడుతున్నారు. దాశరథి పదాలను కూరుస్తున్నారు.

అక్కడున్న దృశ్యానికి పదాలతో అనువాదం చేస్తున్నట్లు దాశరథి మాటలను పేరుస్తున్నారు.

“అంతేలేని ఆకాశానికి ఆవల ఉన్నావు
ఎంతో…ఎంతో…దగ్గరగా మా
అంతరంగమున ఉన్నావు”
అన్న మొదటి చరణం పాలగుమ్మి పాడగానే రెండో చరణం దానంతట అదే చరణాల మీద నడిచి వచ్చింది దాశరథి నాలుకమీదికి.

“జలజల పారే సెలయేరులలో వినిపించెనయా నీ మురళి
అశాంతి నిండిన జగాన నేడు ప్రశాంతినొసగును ఆ రవళి”
అంటూ వేణువు పాటలో ప్రపంచ శాంతిని వెతుక్కోవడం దాశరథికే చెల్లు.

“గుసగుసలాడే గులాబీలలో
మిసమిసలలాడే పసిపాపాలలో
మసకమసకగా నీ దివ్యరూపం
మా కన్నులకు కనిపించెనయా”
అంటూ ముగించారు దాశరథి.

ఆ గుసగుసలను, మిసమిసలను అంతకంటే అందంగా రాగంలో బంధించి పాలగుమ్మి పాడగనే పక్కనున్నవారికి ఆ దివ్యరూపం మసకమసకగా కాకుండా స్పష్టంగానే కనిపించింది.

ఆకాశంలో వీచిన ఆ చల్లగాలి ఆకాశవాణి కేంద్రంలో గొప్ప పాటయ్యింది. మన శరీరమే వేణువుగా; ఊపిరినే గాలిగా; మనలో ప్రాణమై ఊదే స్వామికి, ప్రణవమై ఉన్న స్వామికి సులలిత గీత నీరాజనమయ్యింది. ఈ పాట ఇలా పురుడు పోసుకున్నట్లు సంగీతజ్ఞులు రెండు, మూడు తరాలుగా పులకింతగా చెప్పుకొస్తున్నారు.

ఒకసారి మీరు కూడా వినండి. అంతేలేని ఆకాశానికి ఆవల ఉన్న ఆ వేణువు ఊదే స్వామిని దాశరథి పట్టుకొచ్చి మన అంతరంగాల్లో ఎలా కట్టి పడేశారో అర్థమవుతుంది.

రేపు:-
“దాశరథి వీణ”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్