Saturday, January 18, 2025
HomeTrending Newsశివసేన, NCPల పరాభవం వెనుక దశాబ్దాల వైరం

శివసేన, NCPల పరాభవం వెనుక దశాబ్దాల వైరం

మహారాష్ట్ర రాజకీయాలు సరికొత్త సంచలనాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పార్టీలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం శివసేన చీలిక వర్గానికే పార్టీ గుర్తు లభించగా ఇప్పుడు అదే కోవలో ఎన్.సి.పి చీలిక వర్గానికి పార్టీ గుర్తుపై హక్కులు దక్కాయి.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు షాక్ ఇస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో అజిత్ పవార్ చేరారు. ఎన్సీపీ శాసనసభ పక్షం, పార్టీ సర్కారుకి మద్దతు తెలుపుతోందని అజిత్ చెప్పుకొచ్చారు. ఎన్సీపీ గుర్తు మీదే పోటీ చేస్తామని అజిత్ చేపుతున్నట్టుగానే చివరకు ఆయన వర్గానికే గడియారం గుర్తు దక్కింది.

ఎన్సీపీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అజిత్ పవార్‌కు మాత్రమే ఉందని ఈసీ స్పష్టం చేసింది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా శరద్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చింది. శరద్ పవార్ గ్రూపు కొత్త గుర్తు కోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని… ఇందుకోసం ఫిబ్రవరి 7 తేది 4 గంటల వరకు డెడ్‌లైన్‌ విధించింది.

కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో కూడిన మహా వికాస్ ఆఘాఢీ కూటమి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్దం అవుతున్నాయి. మహారాష్ట్ర అస్థిత్వానికి ప్రతీకగా చెప్పుకునే శివసేన, ఎన్సీపిలకు జరిగిన ఈ పరాభవం వెనుక బిజెపి కుయుక్తులు ఉన్నాయని మరాఠా ప్రజలు భావిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతినేలా జరిగిన ఈ కుట్ర వెనుక దశాబ్దాల పగ దాగి ఉందని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినపుడు గుజరాతీలు, మరాఠాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. ముంబై నగరం కోసం గుజరాతీలు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ఆనాటి నుంచి గుజరాతీ వ్యాపార వర్గాలకు మహారాష్ట్ర వాదుల పొడ గిట్టదు. NCP, శివసేనల చీలిక.. ఆ తరువాతి పరిణామాల వెనుక గుజరాతీ లాబీయింగ్ ఉందని మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోంది. మరాఠా అస్తిత్వం అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సరైన నాయకుడు లేడు. రాజ్ ధాకరే ఉన్నా ఆయన ప్రకటనలకే పరిమితం అయ్యారు.

శరద్ పవార్ కుమార్తె ఎంపి సుప్రియ సులే చొరవ తీసుకుని ఈ అంశంపై ప్రజల్లోకి వెళితే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ ఏడాది చివరలో జరిగే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మరే సూచనలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా చీలిక వర్గాల పై చేయి కనిపించినా రాబోయే శాసనసభ ఎన్నికల నాటికి శరద్ పవార్, ఉద్దావ్ ధాకరే వర్గాలనే ప్రజలు ఆదరిస్తారని రాజనీతిజ్ఞుల అంచనా.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్