7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending NewsHyderabad: త్వరలో హైదరాబాద్లో వార్డు పాలన వ్యవస్థ

Hyderabad: త్వరలో హైదరాబాద్లో వార్డు పాలన వ్యవస్థ

హైదరాబాద్ లో ఈరోజు నూతన సచివాలయంలో మంత్రి కే. తారకరామారావు పురపాలక శాఖపైన విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపైన పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కే .తారకరామారావు అధికారులకు వార్డు పాలన వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజలకు పరిపాలన ఫలాలు అందించాలన్న ఒక ఉన్నత లక్ష్యంతో నూతనంగా జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను, ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు నూతన పురపాలికలను, గ్రామపంచాయతీలను కూడా ఏర్పాటుచేసి ప్రజల ఇంటి ముందుకే పరిపాలన ఫలాలను తీసుకువెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డ్ పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వార్డు పాలన వ్యవస్థ ద్వారా ప్రజలు ప్రస్తుతం సర్కిల్ కార్యాలయాలకు లేదా జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా తమకు అత్యంత చేరువుగా ఉండే వార్డు పరిధిలోనే, తమ ఫిర్యాదులను, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. దీంతో వేగంగా ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం రావడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో పౌరుల భాగసామ్యం పెంచడమే ఈ నూతన విధాన లక్ష్యం అన్నారు.

హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న 150 వార్డుల్లో ఈ వార్డ్ ఆఫీసులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జిహెచ్ఎంసి ఏర్పాటు చేయనున్న ఈ వార్డ్ ఆఫీసులలో సుమారు పదిమంది క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండబోతున్నారు. వార్డు పరిపాలన వ్యవస్థకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారు. ఈయనకి అనుబంధంగా పారిశుద్ధ్యము, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్వహణ, ఎంటమాలజీ విభాగము, వెటర్నరీ విభాగము, టౌన్ ప్లానింగ్ విభాగం,జలమండలి వంటి తదితర కీలకమైన విభాగాలకు సంబంధించిన సూమారు 8 నుంచి 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుతో పాటు ప్రజలకు ఉన్న ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి వేగంగా పనిచేస్తారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న ఈ వార్డు పాలన వ్యవస్థ మే నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రానున్న ఒకటి రెండు వారాల్లో వార్డు కార్యాలయాల్లో ఉంచాల్సిన సిబ్బందితో కూడిన బృందాలను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మొత్తం బృందాలను ఈ రెండో వారంలోగా సిద్ధం చేసి, వారికి వార్డు పాలన వ్యవస్థ ఉద్దేశాలు, లక్ష్యాలను, అది పనిచేసే తీరుకు సంబంధించిన అంశాల్లో పక్కా ప్రణాళికతో కూడిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. వార్డు కార్యాలయాలను ఏకరూపంగా ఉండేటట్లు, ఒక సిటిజన్ ఫ్రెండ్లీ డిజైన్ ను కార్యాలయాల కోసం రూపొందించాలని సూచించారు. వార్డ్ కార్యాలయాలను సామాజిక మాధ్యమాలతో పాటు, ప్రతి వార్డు కార్యాలయం ఇంకో వార్డు కార్యాలయంతో అనుసంధానం అయ్యేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ వార్డు పాలన వ్యవస్థ వలన ప్రజలకు పౌర సేవలు వేగంగా అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, ఈ వార్డు పాలన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేయాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులకు కేటీఆర్ ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కూమార్, జలమండలి యండి దానకిషోర్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్