Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపూవై పుట్టి పూజే చేసి పోనీ రాలి పోనీ...

పూవై పుట్టి పూజే చేసి పోనీ రాలి పోనీ…

“రాలెడు ప్రతి సుమ మేలా నవ్వును!
హైమవతీ కుసుమాలంకారములందున తానొకటౌదునటంచునొ !
లలితామృదుమంజులమగు కాయము
పూవుల తాకులతో వసివాడదొ !
భారతియట పార్వతికి నలంకారము
దీర్చెడునది!”

మరికాసేపట్లో శివతాండవం మొదలుకాబోతున్న వేళ…గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారాల అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది.

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో కూర్చుని రాసిన శివతాండవ కావ్యంలో తాండవానికి ముందు జరుగుతున్న ఏర్పాట్లు, ప్రకృతి పరవశానికి సంబంధించిన సందర్భమిది.

మా బంధువు రమాదేవి ఏరి కోరి ఆ పుట్టపర్తివారి ప్రొద్దుటూరునుండి దీపావళికోసం పూల వనాన్ని మా ఇంటికి పంపారు. రంగురంగుల విడిపూలు. ద్వారాలకు వేలాడేయడానికి బంతిపూల హారాలు. ప్రత్యేకించి నిగనిగలాడే ఎర్ర కలువలు. కనకాంబరాలు. మల్లెలు. జాజులు. చేమంతులు. బంతులు. సంపంగెలు. గులాబీలు. “తెలవారకుండగ పూల రంధ్రాలలో దూరి…వింతవింత రంగులు పులిమి పులిమి తీరికేలేని విశ్వసంసారమందు అలసిపోయితివేమో ప్రభూ!” అంటాడు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలా రాత్రి ప్రొద్దుటూరునుండి పూల మూట బస్సులో పంపితే మా ఆఫీసు సిబ్బంది కాచిగూడకు వెళ్ళి తెలవారకుండగ తీసుకొచ్చారు. పండగకు పూలంటే ఏదో పది మూరలుంటాయనుకుంటే…నాలుగు ఇళ్ళను అలంకరించినా ఇంకా మిగిలిపోయేన్ని పూలు. కొన్ని పెట్టుకుని మిగతావి దగ్గర్లోని బంధువుల ఇళ్ళకు పూలవాయనం పంపాము. దాంతో ఇంటి ఫ్లవర్ వాజుల్లో ప్లాస్టిక్ పూలు పక్కన పడేసి…సంపంగెలు, గులాబీలు చుట్టూ పెట్టి మధ్యలో కలువను కూర్చోబెట్టడంలో, ఇల్లంతా పూలతో అలంకరించడంలో నా భార్య బిజీ అయిపోయింది. గాజు పళ్లెంలో నీరు- కలువ; గాజు గిన్నెలో నీరు- కలువ; పూజలో లక్ష్మీదేవి మెడలో కలువ; దుర్గాదేవి పాదపీఠంముందు కలువ…ఎటు చూసినా పూలే పూలు.

“తామర తూడులందుండేటి ముద్దరాలు; లేములుడిపెడి లేజూపు లేమ…” అంటాడు ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు. తామర తూళ్ళలో ఉండే తల్లి; చల్లని కడగంటితో దారిద్ర్యాన్ని పోగొట్టే తల్లి- లక్ష్మీదేవి.

అసలే కలిమి లేక లేమిలో ఉన్నాం. తామరలను పోలిన కలువలు తామరతంపరగా వచ్చాయి. ఇక రావాల్సింది ఆ తల్లి లేచూపు కలిమే.

“నమోస్తు నాళీక నిభాననాయై”
“నమోస్తు శతపత్ర నికేతనాయై”
“సరసిజ నిలయే సరోజ హస్తే”

అని కనకధారాస్తవం నిండా తామరతూడులో ఉండే తల్లిని; శతపత్రదళ కమలంలో ఉండే తల్లిని; పద్మంమీద పద్మం చేతబట్టి పద్మాలయగా కూర్చున్న లక్ష్మీదేవిని పద పద్మదళాలతో పరిపరివిధాలుగా స్తుతించాడు శంకరాచార్యుడు. దాంతో కనకధార కురిపించింది తల్లి. అలా ప్రొద్దుటూరు కలువలతో ఇల్లంతా అలంకరించి…లక్ష్మీదేవి మెడలో తూడు సహిత కలువను వేసి, దుర్గమ్మ పాదం ముందు విచ్చిన కలువను ఉంచి…నేను కూడా కనకధారకోసం నిరీక్షిస్తున్నాను.

పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్రాకర్స్ అయితే కాల్చుకోండి పర్లేదు అని సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ పూల వెలుగులముందు ఈసారికి ఏ వెలుగైనా సూర్యుడిముందు దివిటిలాగే అనిపిస్తోంది నాకు.

“పూలబాసలు తెలుసు ఎంకికి…” అంటాడు నండూరి సుబ్బారావు ఎంకి పాటల్లో. “శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ” అంటాడు సిరివెన్నెల. దీపావళి శోభకు, పూజకు ఎక్కడో మొగ్గతొడిగిన పూలు ఇంటిదాకా వచ్చి…విచ్చి…పరిమళించడంలో ఏవేవో పూలబాసలున్నాయి. పుట్టపర్తివారన్నట్లు రాలే పూల పరవశాలున్నాయి.

“పూవై పుట్టి పూజే చేసి పోనీ రాలి పోనీ…
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపొనీ…”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular