కడపజిల్లా తాళ్ళపాక పక్కన పెనగలూరులో తెలుగు ఉపాధ్యాయుడు, సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు, పురోహితుడు, జోతిశ్శాస్త్రవేత్త పమిడికాల్వ చెంచు నరసింహయ్య శర్మ పెద్ద కొడుకు మా నాన్న చెంచు సుబ్బయ్య శర్మ(1944-2022). పెనగలూరులో బడి చదువుల తరువాత తిరుపతిలో ప్రఖ్యాత పండితుడు, అన్నమయ్య సాహిత్యాన్ని వెలికి తీసిన నలుగురిలో ముఖ్యుడు బ్రహ్మశ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ ప్రియ శిష్యుడు అయ్యారు. వారివద్దే అవధాన విద్య నేర్చుకున్నారు. వారే నాన్నను లేపాక్షి ఓరియంటల్ కళాశాలకు లెక్చరర్ గా సిఫారసు చేసి పంపారు.
లేపాక్షి, హిందూపురాల్లో పాతికేళ్ళపాటు భాషా సాహిత్యాలు, అష్టావధానాలతో క్షణం తీరికలేని జీవితం గడిపారు. రాయలసీమ, కొంత భాగం కన్నడ నేలల్లో ఆయన ఉపన్యాసం చెప్పని ఊరు, అవధానాలు చేయని ఊరు లేదు. ఎస్ కే యూనివర్సిటీలో శ్రీ శలాక రఘునాథ శర్మ గైడ్ గా త్యాగరాజు సాహిత్యం మీద పి హెచ్ డి చేశారు.

కవిత్రయ భారతం, పోతన భాగవతం, అన్నమయ్య, త్యాగయ్య రచనల్లో ఏది అడిగినా పుస్తకం చూడకుండా నోటికి చెబుతారు. పోతన అంటే పులకింత. లేపాక్షిలో మా ఇంటి పేరు – “భాగవత కృప”.
నెమ్మదిగా భాషా సాహిత్యాల నుండి ఆధ్యాత్మిక రచనా వ్యాసంగాల వైపు మళ్ళారు. విష్ణు సహస్రం, లలితా సహస్రం, సౌందర్య లహరి, శివానందలహరి ఇతర స్తోత్రాలకు వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. పదవీ విరమణ అయిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మ ప్రచార పరిషత్ సారథ్య బాధ్యతలు నిర్వహించారు. అనేక మంత్రాలకు సరళ వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. మొత్తం వందకు పైగా ఆధ్యాత్మిక వ్యాఖ్యాన గ్రంథాలు పుస్తకాలుగా వెలువడ్డాయి.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యుల రచనలను నాకు రుచి చూపించింది మా నాన్నే.
పద వ్యుత్పత్తిని ఊహించడం నేర్పింది మా నాన్నే.
సంస్కృత శ్లోకం, తెలుగు పద్యం ఏదో ఒక క్రమ రూపంలో పాడడం ద్వారా జ్ఞాపకం ఉంచుకోవడం సులభం అని నేర్పింది మా నాన్నే.
ఛందస్సు, అలంకారాలు, భాషోత్పత్తి, భాషా పరిణామం లెక్కలకంటే గొప్ప లెక్కలుగా తేలే శాస్త్రమని తెలియజెప్పింది మా నాన్నే.
భాష ఒక శ్వాసగా పరిగణిస్తే అన్ని రూపాల్లో ఉన్న భాష ప్రాణం కంటే గొప్పదని నేర్పింది మా నాన్నే.

రాసే భాషలో అక్షర దోషాలు లేకుండా రాయాలని ఆయన నియమం. ఒక చేతికి సెలయిన్ ఎక్కుతుండగా, నోట మాట లేక, పేపర్ మీద రాస్తున్న చివరి క్షణాల్లో కూడా ఫుల్ స్టాపులు, కామాలు, ప్రశ్నార్థకాలతో రాయడం ఆయన పద్ధతి.
చివరి రోజుల్లో ఆయన స్పృహను, జ్ఞాపకశక్తిని పరీక్షించడానికి శంకరాచార్యుల రామకర్ణామృతానికి సిద్ధేంద్ర కవి తెలుగు అనువాద పద్యం మూడు పాదాలు ఒక పద్యానివి చదివి, ఒక పాదం మరో పద్య పాదానిది చదివితే…వెంటనే చెయ్యి అడ్డు పెట్టి తప్పు దిద్దారు. ప్రాస పోయింది…తెలియడం లేదా? అని హెచ్చరించారు.
అనంతమయిన ఆయన పుస్తక భాండాగారం ఆయన చదివిన తిరుపతి ఎస్ వీ యూనివర్సిటీ లైబ్రరీకే చేరింది. ఆయన పోయాక అచ్చవుతున్న పుస్తకాలను అందుకుంటున్నప్పుడు ఒక పక్క బాధ, మరోపక్క ఆనందంగా ఉంటోంది. ఎప్పుడో తొమ్మిదేళ్ళక్రితం టి టి డి వారి ఇతిహాస పురాణ ప్రాజెక్టు కోసం వ్యాసుడి శివపురాణానికి అనువాదం చేశారు. అది మొన్న అచ్చయ్యి…బ్రహ్మోత్సవాల్లో ఆవిష్కారమయ్యింది. మొత్తం నాలుగు భాగాలు. అందులో మొదటి భాగం నాన్నది. వరుసగా రెండు, మూడు, నాలుగు భాగాలను సంస్కృతాంధ్ర పండితులు ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి, ఆకెళ్ళ విభీషణ శర్మ, బేతవోలు రామబ్రహ్మం అనువదించారు.

వ్యాసుడి 18 సంస్కృత పురాణాలను సరళమైన తెలుగులోకి అనువదించే పెద్ద యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. పురాణ, ఇతిహాస ప్రాజెక్ట్ పేరిట టీటీడీ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సంస్కృతాంధ్ర భాషల్లో పేరున్న పండితులచేత అనువాదాలు చేయిస్తున్నారు. ఇప్పటికి తొమ్మిది పురాణాల అనువాదం పూర్తయి అచ్చయ్యాయి కూడా. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి కావొచ్చు. పురాణాల మీద పి హెచ్ డి చేసి వేంకటేశ్వర వైభవాన్ని వ్యాఖ్యాతగా ప్రచారం చేస్తున్న ఆకెళ్ళ విభీషణ శర్మ పురాణ, ఇతిహాస ప్రాజెక్టుకు ప్రత్యేకాధికారి. లింగ పురాణం, శివ పురాణం లాంటి శైవ సంబంధ పురాణాలకు కూడా సమ ప్రాధాన్యమిస్తూ శైవ వైష్ణవ భేదం లేకుండా తెలుగువారికి మొత్తం పురాణాలు అందుబాటులో ఉంచుతున్న టీటీడి కృషి అభినందనీయం.
సూర్యుడి వెయ్యి కిరణాలను తెలియజేసే మంత్రాలు, స్తోత్రాలు; వాటిలో దాగిన రహస్యాలు; లోకానికి ఆ వెయ్యి కిరణాలవల్ల ప్రత్యక్షంగా కలిగే ఉపయోగాల గురించి చివరిరోజుల్లో చాలా శ్రమతో వ్యాఖ్యానం రాసేవారని మా నాన్న మిత్రుడు సంస్కృతాంధ్ర పండితుడు ఆకెళ్ళ విభీషణ శర్మ చెప్పారు. దాదాపు ముప్పాతిక భాగం పూర్తయ్యిందట. కానీ ఆ స్క్రిప్ట్ దొరకలేదు. ఇలా మరికొన్ని స్క్రిప్ట్ లు ఎక్కడున్నాయో తెలియడం లేదు. తెలుగు భాషకు- సంగీతానికి అంతర్గతంగా ఉన్న సంబంధాన్ని త్యాగరాజ కీర్తనల ఆధారంగా నిరూపిస్తూ రాసిన వ్యాసాలు అద్భుతంగా ఉంటాయని మా నాన్న శిష్యులైన తెలుగు టీచర్లు, లెక్చరర్లు అందులోని విషయాలు అప్పుడప్పుడూ చెబుతుంటారు కానీ…ఆ స్క్రిప్ట్ నాకు దొరకలేదు. పుస్తకంగా అచ్చు కాలేదు. తెలుగు భాషను పద్యం ఎలా రక్షించిందో వివరిస్తూ రాసిన పరిశీలన గ్రంథం స్క్రిప్ట్ కూడా అందుబాటులో లేదు. భారతి పత్రిక మొదలు వివిధ సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక పత్రికల్లో అచ్చయిన వ్యాసాల్లో కొన్ని మాత్రం ఆయన లైబ్రరీలో ఉండడంవల్ల నాకు వారసత్వ నిధిగా దొరికాయి.
విష్ణు, లలితాసహస్రనామాలకు ఆయన రాసిన వ్యాఖ్యానాలకు బాగా పేరు వచ్చింది. అనేక ముద్రణలకు నోచుకున్నాయి. శివసహస్రనామాలకు అలాగే వ్యాఖ్యానం రాయాలని అనుకున్నారు. కుదరలేదు. బహుశా ఆ వెలితి వ్యాసుడి శివపురాణంలో కొంతభాగాన్ని తెలుగులోకి అనువదించడంతో తీరినట్లుంది.

“ఆత్మావై పుత్ర నామాసి”. ఆయన స్థాయిలో చదవలేకపోయినా…రాయలేకపోయినా…ఆయనవల్ల నా తప్పులు దిద్దుకోగలిగాను. నాలుగు తెలుగు మాటలు నేర్చుకోగలిగాను. పది పద్యాలు పాడగలుగుతున్నాను. తెలుగు, సంస్కృత వ్యాకరణంలో ఆవగింజంత అయినా పట్టుకోగలుగుతున్నాను. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేంత భాషా సాహిత్యాలు నాకు అబ్బకపోవచ్చు కానీ… బతుకు పద్యమై, శ్లోకమై…హృద్యమైన ఆయన దారిలో నడవడానికి మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాను.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

