Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబంగారం పంట పండుతోంది

బంగారం పంట పండుతోంది

బంగారం మీద మన మోజు ఈనాటిది కాదు. యుగయుగాలది.
బంగారం లాంటి మనిషి.
బంగారు కొండ.
బంగారు కుటుంబం.
నీ ఇల్లు బంగారం కాను.
సువర్ణాక్షరాలతో లిఖించడం.
ఒళ్ళంతా బంగారం.
బంగారు పంజరం.
స్వర్ణాభరణాలు.
బంగారు తూగుటుయ్యాల.
బంగారు గోపురం.
పలుకే బంగారం.
స్వర్ణ సింహాసనం.
స్వర్ణ వర్ణం.
బంగారానికి తావి అబ్బినట్లు.
మెరిసేదంతా బంగారం కాదు. బంగారం పండే భూమి.
బంగారంలాటి పంట.
…ఇలా మన బతుకంతా బంగారుమయం. భాషంతా బంగారుమయం. మన బంగారం మంచిదయితే కదా … ఇతరులను అనడానికి?

లక్షాధికారైనా లవణమన్నమే తినాలి కానీ…మెరుగు బంగారం తినలేడు అని కవి శేషప్ప ధర్మపురి నరసింహుడి ఎదుట సీసపద్యంలో చెబితే చెప్పి ఉండవచ్చు కానీ…మనం మెరుగు బంగారం తినడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం.

“సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః; హిరణ్యగర్భః” అంటూ వాల్మీకి రామాయణం యుద్ధకాండలో అగస్త్యమహర్షి రాముడికి చెప్పిన ఆదిత్య హృదయంలో బంగారు రంగులో ఉన్న సూర్యుడు; బంగారాన్ని పుట్టించే సూర్యుడు; బంగారాన్ని కడుపులో దాచుకున్న సూర్యుడు అని బంగారం ప్రస్తావన ఉంటుంది.

సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. నీళ్లను ఆవిరి చేసి మేఘాలకు చేర్చే కిరణాలు కొన్ని. వేడినిచ్చే కిరణాలు కొన్ని. వెలుగులు పంచే కిరణాలు కొన్ని. శక్తినిచ్చే కిరణాలు కొన్ని. ఆరోగ్యాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. లేత కిరణాలు కొన్ని. ముదురు కిరణాలు కొన్ని. ఎరుపు రంగు కిరణాలు కొన్ని. పసుపు రంగు కిరణాలు కొన్ని. బంగారు రంగు కిరణాలు కొన్ని. నీలపు రంగు కిరణాలు కొన్ని. అతి నీలలోహిత కిరణాలు కొన్ని. భూమిలోపల చమురు ఏర్పడ్డానికి జిడ్డును కలిగించే కిరణాలేవో సూర్యస్తోత్రంలో స్పష్టంగా వర్ణన ఉంది. అందులో కొన్ని కిరణాలవల్ల భూమిలో బంగారం ఏర్పడుతుంది. ఇంతకంటే లోతుగా వెళితే ఇది ఆధ్యాత్మిక లేదా రసాయనశాస్త్ర చర్చ అవుతుంది.

బంగారం నేరుగా బంగారంగా దొరకదు. మట్టి రేణువుల్లో కలిసిపోయి ఉంటుంది. బంగారు గనులు అనగానే బంగారం తవ్వుకోవడమే అనుకుంటారు. కానే కాదు. భూమి లోలోపలి పొరల్లో మట్టిలో మట్టిగా కలిసిపోయిన బంగారాన్ని వెలికితీయడం చాలా శ్రమతోకూడుకున్న పని. గనిలో కొన్ని వేల టన్నుల బంగారు మట్టిని రకరకాలుగా ప్రాసెస్ చేస్తే ఒక గ్రాము బంగారం దొరికితే గొప్ప. ఇందులో సాంకేతికంగా ఎన్ని అధునాతన ప్రక్రియలు వచ్చినా ఏదీ అంత సులభం కాదు. ఆ సాంకేతిక వివరాలు ఇక్కడ అనవసరం.

ఒకప్పుడు దక్షిణాదిలో ఒక వెలుగు వెలిగిన కోలార్ గోల్డ్ మైన్స్ బంగారం నిజకథ కంచికి చేరి…కె జి ఎఫ్ సినిమా కల్పిత కథలకు మాత్రమే పనికివస్తోంది. ఆంధ్ర, ఒరిస్సా, బీహార్ లతోపాటు మరికొన్ని చోట్ల బంగారు నిక్షేపాలున్నట్లు కనుగొన్నారు. ఆ బంగారం బయటికి రావడానికి ఎన్ని యుగాలు పడుతుందో తెలియదు.

వాల్మీకి రామాయణం యుద్ధకాండలో లక్ష్మణుడు స్పృహదప్పి పడిపోతే రాముడితోపాటు అందరూ డీలాపడతారు. అప్పుడు ఔషధగుణాలున్న విశల్యకరణి, సావర్ణికరణి చెట్ల ఆకులతో వైద్యం చేస్తే వెంటనే లక్ష్మణుడు స్పృహలోకి వస్తాడని…ఆలస్యమైతే ప్రమాదమని వైద్యుడు చెబుతాడు. ఆ చెట్లు హిమాలయాలదగ్గర సంజీవని పర్వతంమీద ఉంటాయని చెబుతూ వాటిని గుర్తుపట్టడానికి రంగు, రూపాల గురించి వివరిస్తాడు. ఆ చెట్ల కొమ్మల చివర ఆకులు విద్యుత్ కాంతులతో మెరుస్తుంటాయని చెబుతాడు. హనుమంతుడు ఆకాశమార్గాన వెనువెంటనే అక్కడికి వెళతాడు. తీరా అక్కడికి వెళితే అన్ని చెట్ల ఆకులు, పూలు రంగురంగుల కాంతులతో మెరుస్తూ ఉంటాయి. తికమకపడతాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా లక్ష్మణుడికి ప్రాణాపాయం కాబట్టి మొత్తం సంజీవని పర్వతాన్ని పెళ్ళగించి తెస్తాడు. మూలికావైద్యం అయి…లక్ష్మణుడు కోలుకున్న తరువాత మళ్ళీ అక్కడే పెట్టి వస్తాడు. ఈ సంజీవని ఔషధాలున్న కొండ ఇప్పటి ఉత్తరాఖండ్ లో ఉన్నట్లు ఇప్పటికీ ప్రచారంలో ఉంది.

ఎముకలు విరిగితే అతికించగల విశల్యకరిణి, స్పృహదప్పితే కోలుకునేలా చేసే సావర్ణికరిణి వెలిగే మూలికలు దొరికే సంగతేమో కానీ...ఫిన్లాండ్ లో “నార్వే స్ప్రూస్” చెట్ల ఆకుల చివర బంగారు వెలుగులతో ప్రపంచానికి కొత్త బంగారు లోకం పరిచయమయ్యింది. ఉత్తర ఫిన్లాండ్ లో దట్టమైన అడవుల్లో బంగారు గనులున్న చోట నీటి పాయలకు అటు ఇటు ఉన్న స్ప్రూస్ చెట్లకు నిజంగా బంగారు కాస్తోంది. మిగతా ప్రాంతాల్లో ఉన్న స్ప్రూస్ చెట్లు మామూలుగానే ఉన్నాయి. అంటే భూమి లోపలి బంగారు రేణువులను నీటితోపాటు వేళ్ళద్వారా ఈ చెట్లు తీసుకుని బంగారు ఆకులను కంటున్నాయి.

అమ్మవారి మణిద్వీప వర్ణనలో కూడా ఇలాంటి చెట్ల మెరుపులు, వెలుగులు చాలా ఉంటాయి.
“సుధాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోవనవతి చిన్తామణిగృహే
శివాకారే మఞ్చే పరమశివ పర్యఙ్కనిలయాం
భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదానన్దలహరీమ్”
-శంకరాచార్యుల సౌందర్యలహరిలో ఎనిమిదో శ్లోకం.

అమృతసాగరం మధ్యలో కాంతులీనే కల్పవృక్షాలు, కదంబ వృక్షాలమధ్య చింతామణి గృహంలో ఉండే తల్లిని కొద్దిమంది మాత్రమే దర్శించి…సేవిస్తున్నారని అర్థం. అంటే ఆ దర్శనం అందరికీ సాధ్యం కాదని అంతరార్థం.

ఇవన్నీ కవుల కల్పనలు…చెట్ల ఆకులకు స్వర్ణవర్ణ విద్యుత్ కాంతులేమిటి? విచిత్రం కాకపొతే! అని కొట్టిపారేసేవారు ఒకసారి ఫిన్లాండ్ దాకా వెళ్ళి స్ప్రూస్ చెట్ల ఆకులను తాకి...వీలైతే చెట్లకు కాచిన పది గ్రాముల బంగారాన్ని జేబులో వేసుకుని రాగలరు.

రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యవాసులందరూ సరయూ నది దాకా వెళ్లి వీడ్కోలు ఇచ్చి వచ్చారు. వేళ్ళున్నందుకు కదల్లేక చెట్ల కొమ్మల చేతులు రాముడు వెళ్ళినవైపు తిప్పి విలపించాయన్నాడు వాల్మీకి. చెట్లకు ఒక భాష ఉందని శాస్త్రీయంగా రుజువయ్యింది. ఫిన్లాండ్ లో స్ప్రూస్ చెట్లది బంగారు పూత; బంగారు కాత; బంగారు భాష.

స్ప్రూస్ చెట్లను విరివిగా పెంచి గనులు తవ్వకుండా చెట్ల ఆకులనుండి బంగారాన్ని దూసుకునే, పిండుకునే శాస్త్రీయ విధానాలపై ఇక పరిశోధనలు జరుగుతాయట. నిజమే. చెట్లకు బంగారం కాస్తుంటే…గునపాలు తీసుకుని బంగారం కోసం మట్టిని తవ్వే మట్టి బుర్రలు ఎందుకుంటాయి?

సృష్టిలో ఎన్నెన్నో ఇలాంటి వింతలు. అందులో మనం చూసింది, విన్నది, అనుభవిస్తున్నది సముద్రంలో ఆవగింజంత-అంతే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular