IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ కాపిటల్స్ 4 వికెట్లతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, పావెల్ బ్యాటింగ్ లో రాణించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. లక్ష్యం స్వల్పమే అయినా ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి విజయం సొంతం చేసుకుంది.
ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా ఓపెనర్లు ఆరోన్ పించ్(3); వెంకటెష్ అయ్యర్(6) విఫలమయ్యారు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్రీజులో నిలదొక్కుకోగా ఇంద్రజీత్ (6); సునీల్ నరేన్ (డకౌట్), ఆండ్రీ రస్సెల్ (డకౌట్) కూడా నిరాశపరిచారు. శ్రేయాస్ అయ్యర్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు, 83 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో నితీష్ రానా- రింకూ సింగ్ లు నిలదొక్కుకుని ఏడో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీష్ 34 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లతో 57 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. ముస్తాఫిజూర్ వేసిన చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు; ముస్తాఫిజుర్ మూడు; చేతన్ సకరియా, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
పరుగుల ఖాతా తెరవక ముందే ఢిల్లీ తొలి వికెట్ (పృథ్వీషా- డకౌట్) కోల్పోయింది, 17 పరుగుల వద్ద వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ (13) కూడా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్ లు మూడో వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు రేపారు. కానీ 26 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేసిన వార్నర్ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ వెంటనే లలిత్ యాదవ్ (22); కెప్టెన్ పంత్ (2) కూడా ఔటయ్యారు. ఈ దశలో అక్షర్ పటేల్, పావెల్ లు దీటుగా ఆడి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అక్షర్ పటేల్ 17 బతుల్లో 24 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 19 వ ఓవర్ చివరి బంతిని సిక్సర్ గా మలిచి పావెల్ విజయం అందించాడు. పావెల్ 16 బంతుల్లో1 ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కోల్ కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు; హర్షిత్ రాణా, సునీల్ నరేన్ చెరో వికెట్ సాధించారు.
కుల్దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఐపీఎల్: గుజరాత్ చివరి ఓవర్ మేజిక్