Friday, November 22, 2024
HomeTrending Newsముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అరెస్టు చేసింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున అరెస్ట్ చేయకుండా నివారించలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆప్ నేతలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తి వ్యక్తం చేయకపోవటంతో వెంటనే ఈడి అరెస్టు చేసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు. సుమారు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.

సెర్చ్ వారంట్ తీసుకుని వచ్చామని ఈడీ అధికారులు చెప్పారని సీఎం ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తెలిపారు. ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులు వాడుతున్న సెల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మనీ లాండరింగ్ చట్టంలోని 30 సెక్షన్ ప్రకారం కేజ్రీవాల్ ను విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. విచారణ జరుగుతుండగా కేజ్రివాల్ కలిసేందుకు ఢిల్లీ మంత్రులకు ఈడి అనుమతి ఇవ్వలేదు.

ఈడీ విచారణకు హాజరు కావాలని తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరు కాలేదు. గురువారం ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పై కొన్ని గంటల్లోపే ఈడీ అధికారులు.. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులను ఈడీ అరెస్ట్ చేసింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల తనిఖీలను పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ గురువారం ఖండించారు. కేజ్రివాల్ అరెస్టు నేపథ్యంలో మంత్రి అతిషీ సిఎంగా బాధ్యతలు చేపడతారని సమాచారం.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈడి దూకుడుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయటం… బిజెపి చేజేతులా ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

కేసులో బలమైన ఆధారాలు లభించగానే ఈడి విచారణ వేగవంతం చేసిందని మరికొందరు వాదిస్తున్నారు. అవినీతి ఆరోపణల్లో ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా ఈడి ముందుకు వెళ్ళటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వాదనలు వినిపిస్తున్నాయి.

కేజ్రివాల్ అరెస్టు బిజెపికి రాజకీయ సుడిగుండం అవుతుందా…టీ కప్పులో తుపాను అవుతుందా త్వరలోనే తేలనుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్