ఢిల్లీలో మే 31వ తేదీ నుంచి లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తామని, అన్ లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుత లాక్ డౌన్ 31వ తేది సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని… ఆ తర్వాత దశల వారీగా కొన్ని అనుమతులు మంజూరు చేస్తామని కేజ్రివాల్ చెప్పారు. ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాల కార్యకలాపాలను సోమవారం నుంచి అనుమతిస్తామన్నారు.
కోవిడ్ పాజిటివ్ రేటు 1.5 శాతానికి తగ్గిందని గత 24 గంటల్లో 1100 కేసులు మాత్రమే నమోదయ్యాయని కేజ్రీవాల్ వివరించారు. వ్యాపారాలు లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా మరింత కాలం లాక్ డౌన్ ప్రక్రియను కొనసాగించే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేసమయంలో పేద ప్రజలు పనులు లేక ఆకలి చావులకు గురికాకూడదని అన్నారు. కరోనా వైరస్ నియత్రణను – ఆర్ధిక కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామన్నారు.
ముందుగా ఏ రంగాలకి అనుమతులు ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన దాకా అన్ లాక్ ప్రక్రియ ఆపుదామనుకుంటే… అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉందని కేజ్రివాల్ అన్నారు.