Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Crazy (kejri) Currency:

శ్లోకం:-
“అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా:”

భావం:-
ఆడ తుమ్మెద నల్లటి తమాల వృక్షంపై వాలినట్లు… ఏ మంగళదేవత ఓరచూపులు నీలమేఘశ్యాముడయిన  విష్ణుమూర్తిపై ప్రసరించగానే…ఆయన హృదయం మొగ్గ తొడిగిన చెట్టులా పులకింతలతో పూలు పూస్తుందో…అలాంటి లక్ష్మీదేవి కృప నాకు సమస్త మంగళాలు కలిగించుగాక.

శ్లోకం:-“ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః”

భావం:-
పెద్ద కమలం చుట్టూ ఆగి ఆగి పరిభ్రమించే తుమ్మెదలా విష్ణుమూర్తి మొహంపై వెల్లువెత్తిన ప్రేమతో తన చూపులను ప్రసారం చేస్తోంది లక్ష్మీదేవి. అటు నుండి వస్తున్న ఆమె చూపులు- ఇటు నుండి వెళుతున్న ఆయన చూపులతో ఒక చూపుల దండ తయారయ్యింది. అలాంటి చూపుల తల్లి నాకు సకల సంపదలను అనుగ్రహించుగాక.

శంకరాచార్యుల కనకధారాస్తవంలో శ్లోకాలివి. ఆరేడేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు కాలడిలో భిక్షాటనకు వెళ్లి ఒక పేదరాలి ఇంటిముందు భిక్ష అడిగితే…ఇంట్లో ఏమీ లేక…వట్టి చేతులతో పంపలేక…ఒకే ఒక ఎండు ఉసిరిక్కాయ ఉంటే…దాన్ని శంకరుడి భిక్షా పాత్రలో వేసి…తన దీనస్థితికి కుమిలి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు శంకరుడు ఈ పేదరాలికి సంపద ఇవ్వు తల్లీ అని లక్ష్మీదేవిని ప్రార్థించే సందర్భం ఇది. శంకరుడి మొట్టమొదటి రచన. ఆ ఇంటి గుమ్మం ముందు ఆశువుగా చెప్పినది.

పాప పుణ్యాలను బట్టి సుఖ దుఃఖాలు, సిరి సంపదలు ఉంటాయని చెబుతూ ఈ పేదరాలికి సంపద ఇవ్వడానికి ఆమె అకౌంట్లో పుణ్యం లేదు…నా రూల్స్ ఒప్పుకోవు అని మొదట లక్ష్మీదేవి ఖరాఖండిగా శంకరుడికి చెబుతుంది. అదేమిటి తల్లీ! ఉన్న ఒక్క ఎండు ఉసిరిక్కాయను దాచుకోకుండా భిక్ష వేసి…ఇంతకంటే ఏమీ ఇవ్వలేకపోయానే అని కుమిలి కుమిలి ఏడుస్తుంటే…ఇంతకంటే ఏమి పుణ్యం కావాలి? రూల్స్ నువ్వనుకుంటే అమెండ్ చేయడం నీకు చిటికెలో పని…అని…లక్ష్మీదేవి ఆ క్షణాన కాదనడానికి వీల్లేకుండా శంకరాచార్యులు మొహమాటపెట్టినప్పటి శ్లోకాలివి.

సకల భువన భాండాలను పాలించే మహా విష్ణువు మనసు మీద నీ చూపులు తగలగానే ఆయన పులకింతలతో పూలు పూచిన చెట్టయి పొంగిపోయి గాల్లో తేలుతూ ఉంటాడు. నువ్వు ఆయన్ను చూస్తావు. ఆయన నిన్ను చూస్తాడు. మీ ఇద్దరి చూపులు రేపులు మాపులు రూపుల వంతెన కడతాయి. ఆ వంతెనపైన మేము భద్రంగా నడిచి భవసాగరాలను దాటేస్తాం.

తినడానికి తిండిలేక ఏడ్చే పేదరాలికి ఇంత అన్నం పెట్టమ్మా! అని అడక్కుండా…శంకరుడు చమత్కారంగా అటు నుండి నరుక్కొచ్చాడు. ఏమిటి తల్లీ! నువ్వొక్క ఓర చూపు చూస్తేనే శ్రీ మహా విష్ణువు అంతటివాడు సిగ్గుల మొగ్గయి బుగ్గల్లో సొట్టలు పడి…మళ్లీ మళ్లీ నీ చూపులకోసం ఎదురుచూస్తూ ఉంటాడు…అలాంటి నీ కడగంటి చూపులో శత సహస్రాంశం ఈ పేదరాలి మీద ప్రసరిస్తే…అని ఇంకా మాట పూర్తి కాకముందే నిలువెల్లా పొంగిపోయిన లక్ష్మీదేవి బంగారు ఉసిరిక్కాయలను ఇక చాలు అనేవరకు చిల్లుపడ్డ ఆ పేదరాలి ఇంటి పైకప్పు గుండా వర్షించింది.

ఎవరిని ఎలా అడగాలో తెలియకపోతే ఒకసారి శంకరాచార్యులను సంప్రదించండి. ఎవరు ఏ మాటకు బుట్టలో పడతారో శంకరాచార్యుడికి తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలిసినట్లు లేదు. పెద్దవారికి పెద్ద పెద్ద విషయాలు మనం చెప్పలేం. చాలా చిన్న చిన్న విషయాలే పెద్దవారికి మనం చెప్పగలిగిన చాలా పెద్దవి. ఇదొక టెక్నిక్.

సందర్భం-1
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చి కోటి కోట్ల చెక్కు మీద లక్ష్మీదేవి సంతకం కోసం చేతులుకట్టుకుని నిలుచుని ఉన్నాడు. మహావిష్ణువు బాల్కనీలో మందార వృక్షం కింద పేపర్ చదువుతూ ఉన్నాడు. లక్ష్మీదేవి సంతకం చేస్తూ…విష్ణువును ఓరకంట చూసింది. ఆయన క్రీగంట లక్ష్మీదేవిని చూశాడు. ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు పువ్వు పూసింది.

సందర్భం-2
ఉక్రెయిన్ మీద రష్యా ఏ క్షణమయినా అణు బాంబు వేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉంది. ఇంద్రుడొచ్చి గుక్క తిప్పుకోకుండా విష్ణువుకు వచ్చిన, రాబోయే సమస్యలన్నీ చెబుతున్నాడు. ఇంట్లో గింజలు నిండుకున్నాయి…చేతిలో చిల్లి గవ్వ లేదు…ఏమయినా చేయి తల్లీ! అని బ్రహ్మ లక్ష్మీదేవి ముందు లిటరల్ గా ఏడుస్తున్నాడు.

మనకు పది రూపాయలు అత్యవసరంగా కావాలి. ఈ రెండు సందర్భాల్లో మనం అక్కడ ఉంటే…ఏ సందర్భంలో సహాయం అడుగుతాం?

నిజానికి ఆమె చూసినప్పుడు ఆయన చూడడం…పూర్తి పర్సనల్.  మనం ఆ టైమ్ లో మధ్యలో ఉండకూడదు. ఉన్నా మాట్లాడకూడదు. మాట్లాడినా అంత పర్సనల్ విషయాలను టచ్ చేయకూడదు. చేసినా ఎట్టి పరిస్థితుల్లో వికటించకుండా జాగ్రత్తపడాలి. ఇదంతా కత్తి మీద సాములాంటి సునిశితమయిన విద్య. మనమంటే తడబడి మెడ కోసుకుంటాం కానీ…శంకరాచార్యుల స్థిత ప్రజ్ఞతకు లక్ష్మీ దేవి మురిసి బంగారు వర్షం కురిపించింది. ఆ బంగారంతో ఆయనకు ఆవగింజంత పని కూడా లేదు. ఎవరు ప్రార్థిస్తే వారికి లక్ష్మీదేవి సకల సంపదలు ప్రసాదించడానికి వీలుగా శంకరాచార్యులు దీన్ని మనకు ఇచ్చాడు.

indian Currency

“సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!”

తెలుగులో అత్యంత ప్రచారంలో ఉన్న పద్యమిది. లక్ష్మీ దేవి వచ్చేప్పుడు టెంకాయలోకి నీళ్లలా వస్తుందట. పోయేప్పుడు ఏనుగు మింగిన వెలగపండులా…పండు పండులాగే ఉండి లోపల గుజ్జు ఖాళీ అయినట్లు పోతుందట. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. సంస్కృతంలో “గజ భుక్త కపిత్థవత్” అంటే గజ క్రిమి అనే కంటికి కనిపించని పురుగు చిన్న చిల్లు పెట్టి లోపలి గుజ్జును మొత్తం మాయం చేసినట్లు. ఎందుకలా అన్నది ఇక్కడ అప్రస్తుతం.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక అమెరికా డాలర్ ముందు 83 రూపాయలు, ఒక బ్రిటన్ పౌండ్ ముందు 95 రూపాయలు పోస్తే తప్ప తక్కెడలో తూగలేకపోతున్నాం. త్వరలో మన వంద రూకలు పోసినా ఒక డాలరో, ఒక పౌండో కొనలేని రోజులు రావచ్చు. ఆపై పాతికేళ్ళకు రెండొందల రూపాయలు చల్లినా ఒక డాలర్ తీసుకోలేని రోజులు కూడా రావచ్చు.

ఇలా నానాటికి తీసికట్టు అవుతున్న రూపాయి మారకం విలువను కాపాడ్డానికి బంగారు నిల్వలు పెంచుకోవడం, ఖర్చు తగ్గించుకోవడం, గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు అచ్చు గుద్ది చలామణిలో పెట్టడం లాంటి సంప్రదాయ ఆర్థిక స్వావలంబన విధానాలు ఎన్ని అమలు చేసినా…పెద్ద ప్రయోజనం ఏమీ కనపడ్డం లేదు. లౌకిక చర్యలు ఫలితాలు ఇవ్వనప్పుడు అలౌకిక చర్యలను ఆశ్రయించడం సాధారణం.

అలా అవుటాఫ్ ది బాక్స్ ఆలోచించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక అలౌకిక చర్య ద్వారా పతనమవుతున్న భారతీయ రూపాయను కాపాడవచ్చు అని చెబుతున్నారు. నోట్ల మీద జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మకు తోడుగా లక్ష్మీ గణపతి బొమ్మలను కూడా ముద్రిస్తే…రూపాయిని భద్రంగా కాపాడే బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏ దిక్కూ లేని రూపాయి పాపాయికి దేవుడే దిక్కు అన్నది ప్రతీకాత్మకంగా కూడా సరిపోతుంది…అన్నది ఆయన ప్రతిపాదన.

indian Currency

గుజరాత్ ఎన్నికల వేళ ఓట్ల కోసం కేజ్రీవాల్ ఒక పాచిక విసిరారు అని బిజెపి ఉక్రోషం పట్టలేక అరుస్తోంది. కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే… ఇండోనేషియా నోటు మీద గణపతి ఉండగా లేనిది… భారతీయ నగదు మీద లక్ష్మీ గణపతులు ఎందుకు ఉండకూడదు? అన్నది కేజ్రీవాల్ సమాధానం.

వెయ్యేళ్ల కిందట అంటే శంకరాచార్యులు ఉండి అవసరార్థుల కోసం కనకధారా స్తవాలు చదివి…లక్ష్మిదేవిని మన నట్టింట్లో కూర్చోబెట్టి వెళ్లేవారు. ఇప్పుడు కరిమింగిన వెలగపండులా వెళ్ళిపోతున్న లక్ష్మీదేవిని కొబ్బరిలో నీళ్లలా ప్రవేశపెట్టించగలిగిన శంకరులు లేరు కాబట్టి...ఆమె బొమ్మనయినా నమ్ముకుంటే నడిసంద్రంలో మునిగిన రూపాయ కాగితం నావ ఒడ్డుకు చేరుతుందేమో!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

శివరాజ్ పాటిల్ ఉవాచ

Also Read :

ద్రవ్యోల్బణ దారిద్య్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com