Telangana Minister Srinivas Gowda :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో సాంస్కృతిక వైభవం కోసం కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కేంద్రానికి అత్యధిక పన్నులను చెల్లిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఆశించినంతగా ఢిల్లీ సహకారం రావటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని మంత్రి V శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ రాఘవేంద్ర సింగ్ తో ఢిల్లీ, శాస్త్రి భవన్ లో రాష్ట్ర మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర రావు , సత్యవతి రాథోడ్ భేటి అయ్యారు. ములుగు జిల్లాలోని కాకతీయ చక్రవర్తుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయంకు ఐక్యరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక, సామాజిక సంస్థ యూనెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల గుర్తింపు కోసం తయారు చేసిన ప్రతిపాదనలను సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు రామప్ప దేవాలయానికి యూనెస్కో వారసత్వ కట్టడాల గుర్తింపునకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల విజ్ఞప్తి మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్ గారు సానుకూలంగా స్పందించారు. వచ్చే నెలలో ప్రపంచ వారసత్వ కట్టడాల గుర్తింపు కోసం యూనెస్కో ఆధ్వర్యంలో పారిస్ లో జరిగే సమావేశంలో రామప్ప దేవాలయం కు గుర్తింపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియం ల ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ లో చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైట్ షో వేదిక ప్రస్తుతం కోట చివరన ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులకు అసౌకర్యంగా ఉందన్నారు. పర్యాటకుల సౌకర్యం కోసం సౌండ్ అండ్ లైట్ షో వేదికను కోట మధ్యలో ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్ కు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ లో కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటు కు ప్రతిపాదనలను సమర్పించారు. మంత్రుల సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో MP లు బండ ప్రకాష్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ KS శ్రీనివాస రాజు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి