Sunday, January 19, 2025
HomeTrending Newsమద్యం కుంభకోణంలో కేజ్రివాల్, ఎంపీ మాగుంట పేర్లు

మద్యం కుంభకోణంలో కేజ్రివాల్, ఎంపీ మాగుంట పేర్లు

ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ రెండో ఛార్జిషీట్ ఈ రోజు దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆప్ మీడియా ఇన్ ఛార్జ్ విజయ్ నాయర్ తో పాటు పలువురి పేర్లున్నాయి. ఇప్పటికే తొలి ఛార్జిషీట్లోనూ పలువురు వీఐపీల పేర్లను ప్రస్తావించిన ఈడీ.. రెండోఛార్జిషీట్లలో చేర్చిన పేర్లు కలకలం రేపుతున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్.. ఇండోస్పిరిట్స్ చీఫ్ సమీర్ మహేంద్రూ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య తన ఫోన్ నుండి ఫేస్‌టైమ్ వీడియో కాల్ ఏర్పాటు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన తాజా ఛార్జిషీట్ లో తెలిపింది. ఆప్ నేతల తరపున విజయ్ నాయర్ ఢిల్లీ మద్యం పాలసీలో లైసెన్స్‌ల కోసం అడ్వాన్స్‌గా “సౌత్ గ్రూప్” నుండి రూ.100 కోట్లు అందుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ.. గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడిందని కూడా ఛార్జిషీట్ పేర్కొంది. సర్వే బృందాల వాలంటీర్లకు రూ.70 లక్షల నగదు చెల్లింపులు జరిగాయని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ లో ఉన్నారని భావిస్తున్న శరత్ చంద్రారెడ్డి సహా పలువురు తెలుగు రాష్ట్రాల వీఐపీల పేర్లను ఈడీ ఇందులో ప్రస్తావించింది.
ఈడీ ఛార్జిషీట్ పై స్పందించిన కేజ్రివాల్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 5 వేల కేసులు నమోదు చేసి ఉండాలంటూ సెటైర్లు వేశారు. ఈడీ అనేది ప్రభుత్వాలను పడగొట్టడానికి, ఎమ్మెల్యేలను కొనడానికి, అమ్మడానికి పనికొస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఈ చార్జిషీట్ పూర్తిగా కల్పితమన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్