కేంద్రహోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే చేశారు. ఇదే వ్యవహారంలో తెలంగాణ డిజిపి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శిలకు కూడా నోటీసులు ఇచ్చారని సమాచారం. మే 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనట్టు తెలిసింది.
ఎనిమిది మంది ఢిల్లీ పోలీసుల బృందం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వెళ్లి నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే సతీష్ రెడ్డికి నోటీసులు అందించారు. అవసరం అయితే అరెస్టులు కూడా చేసే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ X హ్యాండిల్ షేర్ చేసిందని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని బిజెపి స్పష్టం చేసింది. పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంలో సిఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని కమలం నేతలు అనుమానిస్తున్నారు. బిజెపి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచార సభల్లో సిఎం రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.
అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదు. బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్న వేళ కాంగ్రెస్, బిజెపిల శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కత్తులు దూసుకుంటున్నాయి. పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఏ పార్టీ చిన్న తప్పు చేసినా గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
-దేశవేని భాస్కర్