పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. తమ హయాంలో ప్రతి సోమవారం పోలవారంగా మార్చి ప్రాధాన్యత ఇచ్చి నిరంతరం సమీక్ష నిర్వహించామని, కానీ ఈ ప్రభుత్వం మూడు నెలలకోసారి సమీక్షిస్తోందని మండిపడ్డారు. తాము 71 శాతం పనులు పూర్తి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా కనీసం ఒక్క శాతం పని కూడా చేయలేకపోయిందని, ప్రాజెక్టు స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని అయన వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు.
పోలవరం నిర్వాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల సిఎం జగన్ నిర్వహించిన సమీక్షలో నిర్వాసితులపై కనీస చర్చ కూడా జరగలేదని దేవినేని విమర్శించారు. నిర్వాసితులు త్యాగమూర్తులని, వారి వల్లే పోలవరం సాకారమయ్యే దశకు చేరుకుందన్నారు. అలాంటి నిర్వాసితుల సమస్యను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. గత నెలలో నారా లోకేష్ తో కలిసి తాము పోలవరం నిర్వాసితుల గోడు తెలుసుకునేందుకు అక్కడకు వెళ్ళమని, వారి దుస్థితి హృదయ విదారకంగా ఉందని, ఈ విషయమై తాము సిఎం జగన్ కు లేఖ రాసినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు. నిర్వాసితుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరించారు. సిఎం కేవలం చెత్త బళ్లకు, రేషన్ బళ్ళకు జెండాలు ఊపుకుంటూ, జయంతి, వర్ధంతులకు, నాయకుల ఇళ్ళలో పెళ్లిళ్లకు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని దేవినేని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వ హయంలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీని తీసుకువచ్చి 55,656 కోట్ల రూపాయలకు మేం అనుమతి తీసుకువస్తే 151 ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలతో కనీసం దీనికి ఆర్ధిక అనుమతి కూడా తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం పోలవరం సవరించిన అంచనాలను 47,725 కోట్లుగా చూపిస్తున్నారని, 7391కోట్ల రూపాయలు తగ్గించారని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు.