తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈసారి సంక్రాంతి రంజుగా ఉండబోతోంది. నాలుగు పెద్ద సినిమాలతో ఐదుగురు పెద్ద హీరోలు బరిలో దిగితున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల విడుదల తేదీలు ప్రకటించగా ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా సంక్రాంతికి వారం రోజుల ముందుగానే జనవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సంక్రాంతి పందెం లో దిగుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతంలో రెండుమూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ జరవరిలో విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదల తేదీని అక్టోబర్ 13గా ఖరారు చేస్తూ పోస్టర్లు కూడా విడుదల చేశారు. కానీ ప్రపంచ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అక్టోబర్ లో సినిమా రావడం లేదని పేర్కొన్నారు.

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌-ఆయన జోడీగా అలియాభట్‌; కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌-జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్-భీమ్లా నాయక్; మహేష్ బాబు-సర్కారు వారిపాట; ప్రభాస్- రాధే శ్యామ్ సినిమాలు వరుసగా జనవరి 12,13,14 తేదీల్లో విడుదల చేస్తున్నట్లు ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఆర్ఆర్ఆర్ జనవరి 7న వస్తుండడంతో తెలుగు ప్రేక్షకులకు ఈసారి సంక్రాంతి పండుగ మరింత కిక్ ఇవ్వబోతోంది. ఈ నాలుగు భారీ సినిమాల్లో ఏది ప్రేక్షకుల అభిమానం విశేషంగా సొంతం చేతుకొని విజేతగా నిలుస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *