రైతును లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ప్రజాప్రతినిధులు- రైతులకు, ప్రజలకు ఇలాంటి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన సేవని చెప్పుకొచ్చారు.
సిద్ధిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో వరిలో వెద సాగు పద్ధతి లో సాగుచేస్తున్న శ్రీ పంగ ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి మంగళవారం సందర్శించారు. నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్ లు, రైతు బంధు సమితి నాయకులు, ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులకు వరి వెదజల్లే పధ్ధతిపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి 42 క్వింటాళ్లు దిగుబడి పొందారని తెలిపారు. ఈ వానాకాలంలో సిద్ధిపేట నియోజకవర్గంలో 20 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుని సత్ఫలితాలను సాధించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి కోరారు.
కేంద్రం ఎఫ్ సీఐ ద్వారా సన్నరకం బియ్యం కొనుగోళ్లు చేస్తామని, దొడ్డు రకం కొనమని కొర్రీలు పెట్టినట్లు, కేరళ మినహా మిగతా చోట్ల దొడ్డు రకం కొనడం లేదని, సన్న బియ్యంతో రానున్న రోజుల్లో సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని మంత్రి వివరించారు.
వానాకాలంలో పంట మార్పిడిలు చేయాలని, పత్తి, కంది పంట పండించాలని కోరుతూ.., కంది, పత్తి పంటలు పెడితే మేలు జరుగుతుందని మంత్రి అవగాహన కల్పించారు. అదే విధంగా ఆయిల్ ఫామ్ తోటలు పెంపకాన్ని చేపట్టాలని రైతులను కోరారు.
వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి ఒకటి నుంచి 2 క్వింటాళ్లు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోలు సరిపోతయన్నారు. వడ్లు చల్లినాక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపు వడ్లు వెదజల్లినాక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిదని మంత్రి వివరించారు.
సాగులో పెట్టుబడులు తగ్గడం, నాట్లకు ముందు చేయాల్సిన పొలం పనులేవీ చేయాల్సిన పనిలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చునన్నారు. ఆ కోవలోనే వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తున్న రైతు ఎల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, మహేంద్రారెడ్డిలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.