Friday, November 22, 2024
HomeTrending Newsఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లకు అగ్ని పరీక్ష

ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లకు అగ్ని పరీక్ష

మహారాష్ట్ర వికాస్ అఘాడి కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ(శరద్‌ పవార్‌)తో కలిసి బరిలో దిగుతున్న శివసేన(ఉద్ధవ్‌ వర్గం) 21 సీట్లలో పోటీ చేయనున్నది. NCP-10 సీట్లు, కాంగ్రెస్-17 సీట్లలో తలపడనుంది.

పోటీ చేస్తున్న సీట్లలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా పట్టు నిలుపుకోవాలని ఉద్ధవ్‌, ఏక్‌నాథ్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా ముంబై, పుణె నగరాల్లో తమ బలాన్ని చాటుకోవాలని ఇరువురూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్షేత్రంలో తీర్పు రానున్నది. మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ థాకరే, శరద్‌ పవార్‌కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. రెండు పార్టీలను చీల్చి బీజేపీతో జతకట్టిన ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ అస్తిత్వం నిలుపుకునేందుకు పోరాడుతున్నారు. ప్రజామద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలతో రెండు వర్గాల నేతలు అగ్నిపరీక్షకు సిద్దమయ్యారు.

కోర్టు తీర్పులు, స్పీకర్‌ నిర్ణయాలు, ఎన్నికల సంఘం ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ.. శివసేనకు అసలు వారసుడు ఉద్ధవ్‌ థాకరేనా? ఏక్‌నాథ్‌ షిండేనా ? ఎన్సీపీకి ఇప్పటికీ నాయకుడు శరద్‌ పవారేనా? అజిత్‌ పవారా? అనేది ప్రజలు తేల్చబోతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఈ లోక్‌సభ ఫలితాల ప్రభావం ఉండనున్నది.

ఆరు దశాబ్దాల క్రితం బాల్‌ థాకరే స్థాపించిన శివసేన పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచినప్పటికీ 2022లో ఏకంగా పార్టీనే చీలిపోయింది. బాల్‌ థాకరే కుమారుడు ఉద్ధవ్‌ థాకరే నుంచి శివసేన పార్టీని, జెండాను, గుర్తును, ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్‌ షిండే లాక్కున్నారు. తామే బాల్‌ థాకరే సిద్ధాంతాలకు వారసులమని, తమదే అసలైన శివసేన అని ఇటు ఉద్ధవ్‌, అటు ఏక్‌నాథ్‌ షిండే చెప్పుకుంటూ వస్తున్నారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న శరద్‌ పవార్‌కు 83 ఏండ్ల వయసులో అసలైన రాజకీయ పరీక్ష ఎదురవుతున్నది. తన సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ ఎన్సీపీని చీల్చి అసలైన ఎన్సీపీ తనదేనని చెప్పుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో తన బలాన్ని చాటుకోవాల్సిన అగత్యం శరద్‌ పవార్‌కు ఏర్పడింది. ఎన్సీపీ తనదేనని ప్రజల్లోనే నిరూపించుకోవాలని అజిత్‌ పవార్‌ భావిస్తున్నారు.

ముఖ్యంగా శరద్‌ పవార్‌ కంచుకోట బారామతి స్థానంలో ఇప్పుడు అసలైన ఎన్సీపీ ఎవరిదో తేలనున్నది. ఇక్కడ శరద్‌ పవార్‌ ఆరుసార్లు, ఆయన కూతురు సుప్రియా సూలే మూడుసార్లు గెలిచారు. మరోసారి తన కూతురు సుప్రియా సూలేను శరద్‌ పవార్‌ బరిలో నిలిపారు. అజిత్‌ పవార్‌ తన సతీమణి సునేత్రను పోటీ చేయిస్తున్నారు. ప్రత్యక్షంగా సుప్రియా, సునేత్ర మధ్య పోటీనే అయినప్పటికీ పరోక్షంగా ఇది శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ మధ్య పోరు. కంచుకోటలోనే ఓడించడం ద్వారా శరద్‌ పవార్‌ రాజకీయ జీవితానికి చెక్‌ పెట్టాలని అజిత్‌ పవార్‌తో పాటు బీజేపీ పావులు కదుపుతున్నాయి.

పార్టీల్లో చీలికల ద్వారా రాజకీయ ఎదురుదెబ్బలు తిన్న ఉద్ధవ్‌ థాకరే, శరద్‌ పవార్‌కు ఎన్నికల గుర్తులు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. శివసేన గుర్తు విల్లు, బాణం… శివసేన(ఏక్‌నాథ్‌ షిండే)కు ఎన్నికల సంఘం కేటాయించింది. శివసేన(ఉద్ధవ్‌)కు కొత్తగా ‘మండుతున్న జ్యోతి’ గుర్తును ఇచ్చింది. ఎన్సీపీ గుర్తు గడియారం… ఇప్పుడు ఎన్సీపీ(అజిత్‌ పవార్‌)కు వెళ్లింది. ఎన్సీపీ(శరద్‌ పవార్‌)కు కొత్తగా ‘బాకా ఊదుతున్న మనిషి’ గుర్తును ఈసీ కేటాయించింది. అనేక ఎన్నికల ద్వారా ప్రజల్లోకి వెళ్లిన గుర్తులు ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌కు వెళ్లడం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఉద్ధవ్‌, శరద్‌ పవార్‌కు సవాల్‌గా మారింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్