Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశాశ్వత ఐసొలేషన్

శాశ్వత ఐసొలేషన్

Covi’D’ivorce: వెనకటికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్- 1973 భూ గరిష్ఠ పరిమితి చట్టం వస్తుందని తెలిసి…చట్టం అమల్లోకి రాక ముందు వందల ఎకరాలున్న పెద్దవారు ఎలాగో ఒకలా భూములను కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఒక కుటుంబానికి వంద ఎకరాలుంటే ముప్పయ్ ఎకరాలు మినహాయిస్తే డెబ్బయ్ ఎకరాలు ప్రభుత్వపరం అయిపోయేది. అదే భార్యాభర్తలు విడాకులు కనుక తీసుకుని ఉంటే ఒక్కొక్కరికి ముప్పయ్ చొప్పున అరవై ఎకరాలు మిగిలి…నలభై ఎకరాలు మాత్రమే పోయేది. విడాకుల లాయర్లకు అప్పుడు విపరీతమయిన డిమాండు ఏర్పడిందట.

ఇక్కడే సంపన్న భర్తలు తప్పులో కాలేశారు. వారి ధ్యాసంతా మిగిలే ముప్పయ్ ఎకరాల మీదే ఉంది కానీ…రాబోయే ఉపద్రవాన్ని వారు ఊహించలేకపోయారు. చాదస్తపు పాతకాలపు గ్రామీణ భర్తలను భరిస్తూ వచ్చిన ఎందరో భార్యలకు విడాకుల కాగితం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రసాదించింది. చేతిలో విడాకుల కాగితం. ముప్పయ్ ఎకరాల మిగులు భూమి. అంతే…అప్పుడు ఇల్లు వదిలినవారు ఇక మళ్లీ…రాలేదట. పైగా ఒకానొక ప్రాంతంలోనే ఈ ఉత్తుత్తి విడాకులు నిజం విడాకులు అయ్యాయని గణాంకాలతో చెబుతుంటారు. అది ఏ ప్రాంతమో ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే!

అసుర సంధ్య వేళ అలా అనకు…పైన తథాస్తు దేవతలు “తథాస్తు” అంటారు అని ఒక హెచ్చరిక ఉంది. ఈ మాటను ఈమధ్య “అంటే సుందరానికి!” సినిమాలో దర్శకుడు వివేక్ ఆత్రేయ వాడినట్లు ఉన్నారు. అలా ల్యాండ్ సీలింగ్ అప్పుడు విడాకులు అనుకున్నారు. తథాస్తు దేవతలు దీవించారు. విడాకులు చేతికొచ్చాయి.

అర్ధ శతాబ్దం కిందట విడాకులతో ఊపిరి పీల్చుకున్న భార్యలకు భూ పరిమితి చట్టం ఒక ఆసరా. అవకాశం. అయాచిత వరం. బంధ విముక్తి. అయితే…పేరుకు విడాకులు తీసుకుని విడిపోకుండా ఒకే చూరు కింద అలాగే ఉండి అదనపు భూమిని అనుభవిస్తూ ఆదర్శ దాంపత్యానికి ఆధునిక ప్రతీకలుగా మిగిలిపోయిన ఎందరికో సరైన గుర్తింపు, మన్నన దక్కలేదని లోకం ఇప్పటికీ కోడై కూస్తోంది. అది వేరే విషయం.

Divorce Rate

మళ్లీ యాభై ఏళ్ల తరువాత కోవిడ్ వల్ల విచిత్రమయిన విడాకులు పెరిగాయి. భారత దేశంలో కోవిడ్ మొదటి, రెండో వేవ్ ముగిసిన తరువాత విడాకుల గణాంకాలను పరిశీలిస్తే సగటు కంటే యాభై నుండి అరవై శాతం పెరుగుదల ఉంది. ప్రత్యేకించి మహానగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వారే కాకుండా…చిన్న చిన్న పట్టణాల్లో దంపతులు కూడా చిన్న చిన్న గొడవలను కోవిడ్ నైరాశ్యంలో పెద్దవి చేసుకుని విడిపోతున్నారు. లేదా విడిపోయే లీగల్ ప్రక్రియను ప్రారంభించారు.

బట్టతలకు మోకాలికి ముడి వేసినట్లు కోవిడ్ కు విడాకులకు సంబంధం ఏమిటని జనం గుండెలు బాదుకుంటున్నారు. సులభంగా అర్థం కావడానికి ఇలా అనుకుందాం.

బెంగళూరులో ఎగువ మధ్య తరగతి దంపతులు. పెళ్లయి 17 ఏళ్లయ్యింది. పిల్లలున్నారు. ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆయన చిత్ర కారుడు. ఉత్తర భారతం నుండి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందుల్లేవు. అనారోగ్య సమస్యల్లేవు. కోవిడ్ మొదటి వేవ్ లో ఢిల్లీలో ఉన్న ఆమె తల్లి ఒంటరిగా ఉండడంతో…పని మనుషులు కూడా ఎవరూ రాకపోవడంతో…తల్లికి తోడు కోసం కొన్ని రోజులకని ఆమె వెళ్లింది. అంతే. ఇక రాలేదు. ఇప్పుడు రావాలని అనిపించడమూ లేదు. తన చేతి కుంచె చిత్ర కళకు ఆమె చేతి కీ బోర్డుకు పొత్తు కుదరడం లేదని ఆయనక్కూడా అనిపించి…ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని…ఎవరి దారుల్లో వారు ఒంటరి ప్రయాణం ప్రారంభించారు.

బాంబేలో ఆమె బ్యాంక్ మేనేజర్. ఆయన కూడా మరొక బ్యాంక్ మేనేజర్. మహారాష్ట్రలో మూడు నాలుగు ఊళ్లు తిరిగి బాంబేలో కుదుటపడే లోపు ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం గడిచింది. ఆయనకు మరోచోటుకు బదిలీ అయ్యింది. ఆమె పిల్లలతో బాంబేలోనే ఉంటోంది. రెండు వారాలకోసారి కలుసుకునేవారు. కోవిడ్ లో రాకపోకలు తగ్గాయి. చిన్న చిన్న కార్యభారాలు పెద్ద పెద్దవై ఎవరి బాధ్యత, పాత్ర ఎంత అంటూ సంసారం అరేబియా సుడి గుండంలో పడింది. అంతే రెండో వేవ్ లో ఆయన ఇంటి మొహం చూడలేదు. రమ్మని ఆమె అడగలేదు. వాట్సాప్పుల్లో వేడి వేడి వాదోపవాదాలు…చివరికి విడాకులతో ఆగిపోయాయి.

ఢిల్లీలో కొత్తగా పెళ్లయిన జంట. ఇద్దరూ వృత్తి నిపుణులు. కోవిడ్ దెబ్బకు ఇద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇల్లు ఆఫీస్ అయ్యింది. ఎవరి పని వారికి ప్రధానం. ఇరవై నాలుగు గంటలూ ఒళ్లో ల్యాప్ టాప్ తో ఎవరి లోకం వారిది. ఇంటి పనుల విషయంలో మొదలయిన మాటల యుద్ధం విడాకుల దగ్గర ఆగింది.

Divorce Rate

న్యాయసలహాలు, న్యాయసేవలు అందించే లీగల్ క్రాఫ్ట్ లాంటి యాప్ లకు ఒక్కసారిగా మూడింతల విడాకుల వ్యాపారం పెరిగింది. కోవిడ్ తో జీత భత్యాల్లో కోతలు, ఉన్న ఉద్యోగాలు పోవడం లాంటి సమస్యలతో ఒత్తిడి, మనస్పర్ధలు, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా విడాకులకు కారణాలు అవుతున్నాయి.

బాగున్నప్పుడు ఆనందం పంచుకుని, బాగాలేనప్పుడు లాభ నష్టాల లెక్కలు మాట్లాడే రోజులు. అతుకుల బొంత బంధాలకు కోవిడ్ సాకుగా దొరికిందా? లేక నిజంగానే కోవిడ్ దాంపత్య బంధాలను తుంచుతోందా?

ఎంతో కొంత పనిచేసే వ్యాక్సిన్లు కోవిడ్ ను ఎంతో కొంత నియంత్రించవచ్చు.

ఎంతో కొంత సర్దుకుపోయే అవసరం లేదనుకున్నప్పుడు ఏ వ్యాక్సిన్లు విడాకులను నియంత్రించలేవు.

(సోర్స్:- 10-07-2022న ఎకనమిక్ టైమ్స్ పత్రికలో ప్రచురితమయిన
“Divorces Among Pros Zoom amid Pandemic Gloom” వ్యాసం)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!

RELATED ARTICLES

Most Popular

న్యూస్