Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

(Be)Foresight: పెళ్లంటే నూరేళ్ల పంట. నిజానికి భాషలో నూరంటే నూరు కాదు. వెయ్యంటే వెయ్యి కాదు. ఎక్కువ అని అర్థం. ఇరవై అయిదేళ్ల వయసులో పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లూ బతికినా- ఆ పెళ్లి అక్షరాలా డెబ్బయ్ అయిదేళ్ల పంటే అవుతుంది కానీ- నూరేళ్ల పంట కాదు.

తెలుగు భాషలో పెళ్లి కుదరడం అన్న మాటలో ఏదో లోతయిన అర్థం ఉన్నట్లుంది. కుదురు అన్నమాటకు చెట్టు కుదురు, బలంగా నాటుకోవడం, నిశ్చయం కావడం, కదలకుండా బలంగా ఉండడం అన్న అర్థాలున్నాయి.  తిక్క కుదిరింది అన్న మాట అనాదిగా వాడుకలో ఉంది. తిక్క మరింత బలంగా మెదడులో నాటుకోవడం, బలపడడం అని కాదు. తిక్క తగ్గి మామూలు మనిషిగా కుదురుకోవడం అన్న పాజిటివ్ అర్థం. అయితే “వాడికి దెబ్బకు తిక్క కుదిరింది” అన్న ఎగతాళి మాటతో  “పెళ్లి కుదిరింది”మాటకు పొత్తు కుదర్చాల్సిన పనిలేదు.

Prenuptial Agreements

ఎంతో శ్రమతోకానీ పెళ్లి కుదరదు. కుదిరిన పెళ్లికి ఎంతో శ్రమిస్తేకానీ పీటల దాకా రాదు. పీటలదాకా వచ్చిన పెళ్లి ఎంతో కష్టపడితేకానీ నిలబడదు. మొత్తమ్మీద పెళ్లి చూపుల నుండి సంసారం కుదురుకోవడం దాకా అడుగడుగునా శ్రమ, వ్యయప్రయాసలు, భయం, అలజడి, ఆందోళన, ఉద్విగ్నత ఎన్నో ఉన్నాయి.

వేదాంత పరిభాషలో అయితే సంసారం ఒక ప్రపంచం. ఒక ఊబి. ఒక మాయ. అందులో మునిగితే తేలలేరు. పడితే లేవలేరు. అయినా వేదాంతులు చెబుతూనే ఉంటారు. సంసారులు వింటూ అందులో పడకుండా ఉండలేరు. చాలామంది సన్యాసులు ఆశ్రమ సంసారాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటారు. చాలా మంది సంసారులు సంసారంలో భౌతికంగా ఉంటూనే ఇల్లు వాకిలిని పట్టించుకోకుండా ఇంటిని సన్యసించి ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఆ ఆశ్రమ సంసారికి, ఈ ఇంటి సన్యాసికి వేదాంత పరిభాష లేదు. ఉన్నా చాలదు. చాలినా అన్వయం కుదరదు. కుదిరినా అర్థం కాదు.

Prenuptial Agreements

పెళ్లి మానవనాగరికతలో ఏర్పడిన గొప్ప వ్యవస్థ. అలాంటి వ్యవస్థ రకరకాల కారణాల వల్ల ప్రమాదంలో పడింది. పెళ్లయ్యాక ఇంట్లో భౌతికంగా జరిగే గాయాలు, ప్రమాదాలు, మనసుకు పడే పగుళ్లు ఎలా ఉన్నా…పెళ్లికి ముందే కొత్తగా ఏర్పడబోయే సంసారంలో చీలికలు, పేలికలు, గొడవలు, కేసులను ఊహించి…దరిమిలా విడాకులు, ఆస్తి పంపకాలు, జరగబోయే విడాకుల నాటికి పుట్టిన పిల్లల(అన్వయం కుదరకపోయినా పెద్ద మనసుతో ఓపిగ్గా అర్థం చేసుకోవాల్సిన భవిష్యత్ విడాకుల దృశ్యమిది) పెంపకం లాంటి విషయాలను పెళ్లి కాకముందే చక్కగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా, స్పష్టంగా, నిస్సంకోచంగా, నీళ్లు నమలకుండా కాబోయే పెళ్లి కూతురు- పెళ్లి కొడుకు మాట్లాడుకునే అత్యంత ముందు జాగ్రత్త రోజులు, పారదర్శకమయిన రోజులు వచ్చాయి.

శుభం పలకరా పెళ్లి కొడకా! అంటే ఆ కొడుకు ఇంకేదో కూసి…పెళ్లి పెటాకులు చేసుకున్నాడు. ఈ సామెతలో పురుషాధిక్యత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆధునిక సమాజం అంగీకరించిన స్త్రీ పురుష సమానత్వం ప్రకారం సామెతను “శుభం పలుకవే పెళ్లి కూతురా! అంటే ఇంకేదో కూసినట్లు…” అని తిరగరాయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

కీడెంచి మేలెంచడం అనాదిగా మన అలవాటు. భారత దేశంలో అత్యంత సంపన్నుల కుటుంబాల్లో ఈ మధ్య పెళ్లికి ముందే… ఒక వేళ ఆ దాంపత్యం నిలబడక నిలువునా చీలి పోయి…కూలిపోతే…అంతులేని ఆస్తుల పంపకం, అడ్డు అదుపు లేని పిల్లల పెంపకం గురించి ముందే స్టాంప్ పేపర్ మీద ఒక ఒప్పందం రాసుకుంటున్నారట. ఈ ఒప్పందాన్ని రిజిస్టర్ కూడా చేయిస్తున్నారట. (ఒక్క గోవా రాష్ట్రంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి ముందస్తు విడాకుల ఒప్పందానికి చట్టబద్ధత లేదు. భవిష్యత్తులో రాదని గ్యారెంటీ లేదు. అది వేరే విషయం.) దీనికి ఇంగ్లీషులో “prenuptial agreement” అని ఎప్పటినుండో పారిభాషిక పదం కూడా ఉంది. తెలుగులోకి ఈ భావం కొంతవరకే అనువాదం అవుతుంది. “పెళ్లికి ముందే ఒప్పందం” అని అనాలి. కానీ “ప్రీ న్యూపిటల్” అంటే పెళ్లి చెడిపోతే తీసుకోవాల్సిన చర్యలు, పంపకాలకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందం. “పెళ్లికి ముందే పెటాకుల ఒప్పందం” అన్నదే పదహారణాల తెలుగు అనువాదం కాగలదు. ఇప్పటికి ఈ మాట ఎగతాళిగా ఉన్నా…కట్టిన తాళిలో ఎగతాళి పెరిగే కొద్దీ…మాటలో ఎగతాళి కనుమరుగయి అర్థ గాంభీర్యం దానంతటదే వస్తుంది.

పాశ్చాత్య దేశాల్లో పెళ్ళికి ముందే…పెళ్లి పెటాకులయితే? అని కూడా పద్ధతిగా, గౌరవంగా, నిమ్మళంగా మాట్లాడుకునే సుహృద్భావ సంప్రదాయం ఉందన్నమాట.

ఇప్పుడిప్పుడే భారత్ లో సంపన్నులు అలవాటు చేసుకున్న ఈ ఒప్పందం రాతకోతలు…త్వరలో సామాన్యులందరు అలవాటు చేసుకోవచ్చు.

సులభంగా అర్థం కావడానికి ఆ ఒప్పందం ఇలా ఉంటుందనుకోవచ్చు.

Prenuptial Agreements

” ఫలానా ఎక్స్ అనే నేను, ఫలానా వై అనే నీవు కలిసి…ఫలానా రోజు పూర్తి స్పృహలో ఉండి ఇష్టపూర్వకంగా రాసుకున్న ముందస్తు పెళ్లి పెటాకుల పరస్పర అంగీకార ఒప్పంద పత్రం.

పందిట్లో మావిడాకులు పచ్చగా పచ్చి వాసనతో ఉండగానే…మన పెళ్లి జరిగిన మొదటి రాత్రికి ముందు సాయంసంధ్యలోనే మన విడాకుల ఉత్సవం జరగవచ్చు. పెళ్లి పందిట్లో వడ్డించిన అరటి ఆకుల్లో అన్నాలు జనం తినక ముందే మన కొంగు ముళ్లు విడిపోవచ్చు. తాళి కట్టి పిడికిట తలంబ్రాల అన్నమయ్య పాటను బాజా బజంత్రీలవాళ్ళు శ్రుతి చేయకముందే మనకు శ్రుతి కలవక విడిపోవచ్చు. సన్నికల్లు తొక్కుతుండగా రాళ్లు పగిలి, గుండెలు చీలి మనం విడిపోవచ్చు.

పిల్లా పీచూ పుట్టిన తరువాత విడిపోవచ్చు.

అకారణంగా విడిపోవచ్చు. సకారణంగా విడిపోవచ్చు.

పొద్దుపోక ఊరికే విడిపోవచ్చు. మొహం మొత్తి విడిపోవచ్చు. కేవలం పండగరోజూ పాత మొగుడేనా? అన్న సామెతలో ప్రశ్నకు సమాధానంగా కొత్త మొగుడికోసం విడిపోవచ్చు.

ఏ రకంగా చూసినా మన సంసారం నిలబడే అవకాశాలు శూన్యాతి శూన్యం కాబట్టి…ఈ క్రింద సూచించిన విధంగా మనం విడాకుల తరువాత మసలుకోవడానికి పరస్పరం అంగీకరించుకుని…పెళ్లి నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి రాహుకాలం, వర్జ్యం, యమగండం, ఆదివారం అమావాస్య అన్నీ కుదిరిన దుర్ముహూర్తం నిర్ణయించుకున్నాం.

  1. విడాకుల రోజు రాత్రి పెళ్లి కంటే ధూమ్ ధామ్ గా పెద్ద పార్టీ ఏర్పాటు కావాలి.
  2. ఆ బ్రేకప్ పార్టీ సంగీత్ లో ఎట్టి పరిస్థితిలో విషాద గీతాలు ప్లే చేయకూడదు. కెవ్వు కేక లాంటి హుషారుగొలిపే పాటలకే మనం విడి విడిగా నృత్యం చేయాలి.
  3. ఇద్దరు పిల్లల్లో అమ్మాయిని మీ అమ్మనాన్న దగ్గర ఉంచి…పెంచాలి. అబ్బాయిని మా అమ్మానాన్న దగ్గర ఉంచి…పెంచాలి.
  4. మళ్లీ జరిగే నా పెళ్లిళ్లకు నేను పిలవకపోయినా నువ్ మొహమాటపడకుండా వస్తూనే ఉండాలి. అలాగే నేను కూడా నీకు మళ్లీ మళ్లీ జరిగే పెళ్లిళ్లకు సిగ్గులేకుండా వస్తూనే ఉంటాను.
  5. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూ ట్యూబ్, వాట్సాప్ లలో మనం ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను మనమే బ్రేకప్ పార్టీకి ముందురోజు లోపు ఓపికగా డిలీట్ చేసుకోవాలి.
  6. మన పిల్లలు భవిష్యత్తులో నీ పిల్లలు, నా పిల్లలతో గొడవపడకుండా…వారిలో ఒక సుహృద్భావ విశాల ప్రాపంచిక వసుధైక కుటుంబ భావనను మనమే పాదుకొల్పాలి.
  7. మిగతా చిల్లర విషయాలను మన ఏరియా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలి.
  8. మన పెళ్లి పెటాకుల ఒప్పందాన్ని పటం కట్టి ఇంటి హాల్లో గుడ్డివారికి కూడా కనిపించేలా విధిగా డిస్ ప్లే చేయాలి.

ఇట్లు ;

కాబోయే పెళ్లి కూతురు………….

కాబోయే పెళ్లి కొడుకు……………

సాక్షి సంతకాలు…………………”

(ఈ వ్యాసానికి సోర్స్:- ఇంగ్లీషు వ్యాపార దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ లో 30-05-22 న ప్రచురితమయిన వార్త.)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

నాతో నాకే పెళ్లి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com