Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Sologamy:
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవీతం నాదీ
సంసార సాగరం నాదె
సన్యాసం శూన్యం నావె

కవినై
కవితనై
భార్యనై
భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటీ జయగీతాల
కన్నీటీ జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై
అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

మింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

గాలి పల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగె వెడలి
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
నా హృదయమె నా లోగిలి
నా హృదయమె నా పాటకి తల్లీ
నా హృదయమె నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి”

కృష్ణవంశి దర్శకత్వంలో చక్రం సినిమాలో సిరివెన్నెల రచన ఇది. చక్రి సంగీతం. శ్రీ గాత్రం. నిజానికి ఇది పాటగా మనకు వినపడడానికి ముందు 24 ఏళ్ల కిందట సిరివెన్నెల రాసి పెట్టుకున్న రచన. సిరివెన్నెల మీద అంతులేని ప్రేమాభిమానాలున్న కృష్ణవంశి ఆ రచనలో అక్షరం ముక్క మార్చకుండా ఆ తాత్విక, మార్మిక, వేదాంత, ఏకాంత అన్వేషణ మార్గానికి సినిమాలో సందర్భం సృష్టించుకుని వాడుకున్నారు. సందర్భానికి పాట రాయడమే గగనం. అలాంటిది సిరివెన్నెల లాంటివారు తమ సొంతానికి రాసుకున్న కవితలే సినిమాలకు, కథాగమనాలకు సందర్భాలు అవుతాయి. జన్మకో శివ రాత్రిలా అయినా ఇలాంటి పాటలను జనానికి ఇస్తున్నందుకు సినిమాలను అభినందించాలి. ఈ పాట రాసిన సిరివెన్నెలకు కోటి దండాలు. ఇలాంటి పాటను మనకిచ్చిన కృష్ణవంశీకి కూడా అర కోటి దండాలు పెట్టకపోతే రుణం తీరదు. ఇదే మాట నేను కృష్ణ వంశీతో అంటే…”ఆ పాట వాడుకోవడం నా అదృష్టం. విన్న ప్రతిసారీ…నా వెంట పడేది. చక్రం కంటే ముందే మురారి, సముద్రం సినిమాల్లో వాడాలని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. చివరకు చక్రం సినిమాలో…సందర్భాన్ని సృష్టించి…వాడాను. సిరివెన్నెలను మరిపించడానికి సిరివెన్నెలే దిగిరావాలి…” అని పులకింతగా చెప్పుకొచ్చారు.

ఈ పాటకు ప్రతిపదార్థం చెబితే అందం చెడిపోతుంది. సముద్రమంత లోతయిన భావం దాగిన పాట ఇది. ఎవరికి వారు వింటూ ఆ ఒంటరితనం ఏమిటో? ఎందుకో? వారికి వారే అన్వయించుకోవాలి.

Sologamy

చుట్టూ జనం ఉన్నా…మనవారి మధ్యే ఉన్నా…ఎన్నోసార్లు ఏదో తెలియని ఒంటరితనంలో పడిపోతూ ఉంటాం.

చెప్పుకోవడానికి జగమంత కుటుంబం. కానీ…ఏకాకి జీవితం. సాగరమంత సంసారం. కానీ…సన్యాసం. అంతా శూన్యం.

కవి, భార్య, భర్త…పాత్ర ఏదయినా మల్లెల దారిలో పన్నీరయినా, మంచు ఎడారిలో కన్నీరయినా, ఏ తోడూ నీడా లేని నా వెంట నేనే నడుస్తూ…నాతో నేనే మాట్లాడుకుంటూ…నాలో నేనే కలిసిపోతూ…ఒంటరిగా నిత్యం కలలు కంటాను. కథలు అల్లుతాను. మాటల కోటలు కడతాను. పాటకు పట్టం కడతాను. కళ్లకు రంగులు అద్దుతాను. మనసు ముంగిట్లో ముగ్గులు వేస్తాను. కావ్య కన్యను కంటాను.

Sologamy

ప్రపంచాన్ని చూసే కన్ను నేనవుతాను. ఆ కంటి మంటను నేను. మంటల మాటున చల్లని వెన్నెల పూతను నేను. సూర్యుడిని నేను. చంద్రుడిని నేను. పగలు నేను. రాత్రి నేను. కాలానికి పాదాలు నేను. ఆ పాదాలు చేరాలనుకునే కనరాని గమ్యాల ఇంద్రజలాన్ని నేను.

గాలి పల్లకిలో నా పాటల పాప ఊరేగుతూ వెళ్ళడానికి ముందు నా గొంతు వాకిలిని మూసేసింది. ఇప్పుడు మూగగా మిగిలిన నా హృదయమే నాకు ఇల్లు వాకిలి. నా హృదయమే నాకు తల్లి, తండ్రి, భార్య. సమస్తం. చీకటి నిండిన నా హృదయమే నాకు అమావాస్య రోజు సన్నటి రేఖగా కనిపించి..కనిపించని చంద్రుడి కళ- సినీవాలి.

Sologamy

దాదాపుగా ఇదీ పాట భావం. అయితే భావం ఇంతే అనుకుంటే మనం పొరబడినట్లే. మాటలకందని మన ఒంటరితనానికి ఒక తోడు ఈ పాట. మన ఒంటరితనాల అంతులేని ప్రశ్నలకు సమాధానం ఈ పాట. సంసారంలో మన సన్యాసానికి అద్దం ఈ పాట. సన్యాసంలో శూన్యానికి అర్థం ఈ పాట. మనతో మనమే మాట్లాడుకోవడానికి దారి ఈ పాట. మనలో మనమే కలిసిపోతున్నప్పుడు ఓదార్పు ఈ పాట. ఒంటరితనం అంత ఒంటరిది కాదు…ఆ ఒంటరితనంలో విశ్వమంతా దాగి ఉంది అని మనల్ను మల్లెల దారుల్లో…మంచు ఎడారుల్లో…పన్నీటి జయగీతాల్లో…కన్నీటి జలపాతాల్లో…ముంచి…ముంచి…ఒడ్డున పడేసే…సిరివెన్నెలకే సాధ్యమయిన ఏకాంత మహేంద్రజాల గీతమిది.

ఇప్పుడు ఈ పాట చర్చ ఎందుకు అవసరమయ్యిందో చూద్దాం. గుజరాత్ కు చెందిన ఒకమ్మాయి తనను తానే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అమ్మాయి- అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అబ్బాయి- అబ్బాయిని పెళ్లి చేసుకోవడం విన్నాం. కన్నాం.

ఈ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కానీ పెళ్లి కూతురుగా ముస్తాబవడం మాత్రం చాలా ఇష్టం. పెళ్లి కొడుకు పొడ గిట్టదు. కానీ హనీమూన్ ఏర్పాట్లు మాత్రం పులకింత. దాంతో తనను తానే పెళ్లి చేసుకుని…గోవాలో రెండు వారాలపాటు తనతో తానే హనీమూన్ వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది.

“నాతో నేను అనుగమిస్తూ
నాతో నేనే రమిస్తూ…”
అని సిరివెన్నెలగారు చెప్పిన ఏకాకి జీవితం పాట మనకు కేవలం పాట. ఈ అమ్మాయికి అదే బాట!

కవి వాక్కు వృథా పోదు అంటే ఇదే మరి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

భార్య బ్యాటింగ్ – భర్త వీపింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com