Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Wife-violence : మాటలకు అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషాలు ఉంటుంటాయి. కంపు అంటే ఒకప్పుడు వాసన అని అర్థం. ఇప్పుడది చెడు వాసన అయ్యింది. చీర అంటే ఒకప్పుడు మగవారు కూడా కట్టుకున్న పంచె. ఇప్పుడు స్త్రీలకే పరిమితం. సుత్తి అంటే జంధ్యాల చెప్పనంతవరకు మేకులు కొట్టే సుత్తి. ఇప్పుడు సుత్తి కొట్టడం అంటే ఏమిటో చెప్పాల్సిన పనిలేదు.

అలా గృహ హింస అంటే మహిళల మీద జరిగే హింసగా ఆ మాటకు అతివ్యాప్తి జరిగింది. సమాసం ప్రకారం ఇంట్లో జరిగే హింస అని మాత్రమే అర్థం వస్తుంది. ఇంకా లోతుగా వెళితే ఇల్లు పెట్టే హింస అని కూడా అర్థాన్ని సాధించవచ్చు.

Domestic Violence

ఇల్లన్న తరువాత భార్య భర్త; అత్త మామ; అమ్మ నాన్న, పిల్లలు, భర్త అక్క/చెల్లెలు, భార్య తమ్ముడు/అన్న ఇలా అనేక మంది ఉండనే ఉంటారు. “సంసారం అనే బండికి భార్యాభర్తలు జోడెడ్లు” అన్న ఉపమానం ఉదాత్తంగా ఉందనుకుని చాలా మంది వాడేస్తూ ఉంటారు కానీ…ఇందులో ఏదో తెలియని పశు ప్రస్తావన దాగి ఉంది. బండి, ఇరుసు, కందెన, కాడి, ఎండు గడ్డి, పచ్చి గడ్డి, మెడలో గంటలు, చర్నాకోల…పరిభాష చాలా పాతది. గ్రామీణ వ్యావసాయిక వ్యవస్థ రాజ్యమేలిన రోజుల నాటి జోడెడ్ల ప్రస్తావన అది. ఇప్పుడంతా కార్లు, విమానాలు, ఆటో మోడ్ డ్రయివింగ్, స్టీరింగ్ లెస్ డ్రయివింగ్ రోజులు. భర్త ఇక ఎంత మాత్రం కాడెద్దు కాదు. భార్య జోడెద్దు కానే కాదు.

విషయం మరీ జనరలైజ్ కాకుండా ముందు రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో ఒక ఊళ్లో ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన సన్నివేశం వీడియో చూడండి.

భర్త ఒక స్కూల్ ప్రిన్సిపాల్. భార్య సాధారణ గృహిణి. భర్త ఇంటికి రాగానే భార్య క్రికెట్ బ్యాట్ పట్టుకుని అతడి వెంటపడి ప్రొఫెషనల్ క్రికెటర్ల కంటే చక్కగా, చిక్కగా, ఒడుపుగా, గట్టిగా, కసిగా కొడుతూ ఉంటుంది. ప్రతి బాల్ ను సిక్స్ కొట్టాలన్నంత తదేక దీక్షతో మెలకువగా కొడుతోంది. ప్రాణ రక్షణ కోసం భర్త ఇల్లంతా పరుగులు పెడుతుంటే…అంతే వేగంతో పరుగెత్తి కొడుతోంది. బ్యాటు గురి తప్పినప్పుడు స్టీల్ వాటర్ బాటిళ్లు కూడా విసురుతోంది.

ఒక సంవత్సర కాలం సుదీర్ఘంగా భార్య చేతిలో బ్యాటు దెబ్బలు తిన్న భర్తకు…ఇక పరుగెత్తే గ్రౌండ్ దొరకలేదు. ఎముకలన్నీ విరిగి, వంగిపోయాయి. శరీరంలో అవయవాలన్నీ పట్టు తప్పాయి. ఏదో ఒకనాటికి తన భార్య ఐ పి ఎల్ మహిళా టీంకు వెళ్లకపోతుందా? తనకు బ్యాటు దెబ్బల బాధ తప్పకపోతుందా? అని ఆ సగటు భర్త కోటి దేవుళ్లకు కోటి కుంకుమార్చన చేస్తూ కాలం గడపసాగాడు. ఏ దేవుడూ తన మొర వినలేదు. దాంతో ప్రాణాలకు తెగించి వరుసగా కొన్ని రోజులపాటు భార్య చేతి బ్యాటుకు తాను బంతిగా మారి…దెబ్బలు తింటూ…ఆ టి ట్వంటీ బ్యాటింగ్ విధ్వంసక విస్ఫోటక దృశ్యాలను సి సి టీ వీ కెమెరాల్లో రికార్డు చేసుకుని…కోర్టుకు సమర్పించి…రక్షణ కోరాడు. చట్టం ఎప్పుడూ తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది కాబట్టి…తరువాత ఏమి జరిగింది అన్నది మనకు అనవసరం.

సాధారణంగా సంసారంలో భార్య జట్టు చాలా పవర్ ఫుల్. భర్త జట్టు పవర్ లెస్. తాత్వికంగా కూడా సంసారం ఒక ఆట. ఎన్నోసార్లు భార్యా భర్తల జట్లు టాస్ వేయకుండానే ఆట మొదలు పెట్టాల్సి ఉంటుంది. రిఫరీ, అంపైర్ గా ఉండడానికి ఆ దేవుడికి కూడా ధైర్యం చాలదు కాబట్టి...సి సి టీ వీ గుడ్డి కన్ను చూసిందే థర్డ్ అంపైర్ నిర్ణయంగా గుడ్డిలో మెల్ల అనుకోవాలి.

భర్త గెలిచినా ఓడినట్లే.
భార్య ఓడినా గెలిచినట్లే. ఇది పబ్లిగ్గా డిబేట్ చేయదగ్గ అంశం కాదు కాబట్టి…ఎల్ల వేళలా భార్య గెలుపును అంగీకరించడమే ఉత్తముల తక్షణ కర్తవ్యం.

Domestic Violence

రాజస్థాన్ అల్వార్ అయ్యవారికి ఈ విషయంలో లోకులు సరిగ్గా అవగాహన కలిగించినట్లు లేరు. ఏ సైద్ధాంతిక, క్రీడా నియమాల విషయాల్లో వీరిద్దరి మధ్య వైరుధ్యాలు వచ్చాయో కానీ…  అతను స్పిన్ వేయకున్నా…ఆమె బ్యాటింగ్ చేయగలుగుతోంది. అతను ఫాస్ట్ బౌలింగ్ చేయకున్నా…ఆమె బ్యాట్ ఝళిపిస్తూనే ఉంది. అతను గుగ్లీ వేయకపోయినా…ఆమె గూబ గుయ్ మనిపిస్తూనే ఉంది. అతను ఫుల్ టాస్ వేయకపోయినా…ఆమె ఫుల్లుగా కొడుతూనే ఉంది. ఓవర్ ఆరు బాల్స్ అయిపోయి భర్త ఏడుస్తున్నా….ఆమె బ్యాటు భంగిమ మార్చి మార్చి కొడుతూనే ఉంది. అతను కవర్ డ్రయివ్ లో తనను తాను కవర్ చేసుకుంటున్నా…ఆమె వెంట పడి కొడుతూనే ఉంది. అతను రూము తలుపు చాటున దాక్కున్నా…ఆమె రివర్స్ స్వింగ్ లో ఉతుకుతూనే ఉంది. అతను ఇంటి మిడాన్ లో వణుకుతున్నా…ఆమె మిడ్ వికెట్ మీదుగా మెరుపులా దూకి కొడుతోంది.

అతను బౌండరీకి పరుగెత్తితే…ఆమె క్రీజ్ లోకి లాక్కొచ్చి దంచుతోంది. కన్న కొడుకు తండ్రికి రక్షణ కవచంలా ప్రాణాలకు తెగించి అడ్డుగా వచ్చినా, ఆర్మ్ గార్డ్ గా దిండు తెచ్చి నిలుచున్నా ఆమె బ్యాటింగ్ ప్రతాపం ఆగడం లేదు. ప్రపంచమంతా పరిమిత ఓవర్ల టీ ట్వంటీ వచ్చినా…అతడికి మాత్రం అపరిమిత ఓవర్ల నిత్య టెస్ట్ మ్యాచే జరుగుతోంది. ఇతడికి బ్యాటింగ్ రాదు. ఆమె బ్యాటింగ్ ఆపదు. ఈ ఒన్ సైడ్ వీరవిహార మ్యాచ్ ఇక ఎప్పటికీ ఆగదు.

అన్నట్లు-
దీన్ని గృహ హింసగా కాకుండా…గృహ క్రీడ- ఇంటి ఆటగా చూసి జనం బాధతో కూడిన…బాధ్యత తోడయిన…వైరాగ్యం కలగలిసిన ఆనందంతో వైరల్ గా దేశమంతా పంచుకుంటున్నారు.

ఏమో!
ఏ ఇంట్లో ఏ బ్యాటు ఏ భర్తను ఏ బంతిగా చేసుకుని పరుగులు పెట్టిస్తోందో?
ఏ స్కోరు బోర్డు చెప్పాలి ఈ రన్నులను?
ఏ టీ వీ లు చూపాలి ఈ తన్నులను?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

భార్యా బాధితులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com