Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Marriages- Food: సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు.

పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు షామియానాలు, మేళతాళాలు, పురోహితులు, ఫోటోలు , వీడియోలు , ఎల్ ఈ డీ స్క్రీన్లు, సంగీత్ నాట్యాలు సకలం కాంట్రాక్ట్ వ్యవహారాలే. పదహారు రోజుల పెళ్లిళ్లు అయిదురోజులకు, తరువాత మూడు రోజులకు, ప్రస్తుతానికి ఒక రోజుకు తమను తామే తగ్గించుకున్నాయి. ఇప్పుడు ఫంక్షన్ హాళ్లు దొరకడం ముఖ్యం కాబట్టి ఒకే ఫంక్షన్ హాల్లో పొద్దున ఒక పెళ్లి, సాయంత్రానికి మరో పెళ్లి జరగాలి కాబట్టి ఆధునిక వివాహాలు గంటల్లోకి కుచించుకుపోయాయి. భవిష్యత్తులో నిముషాల్లోకి దిగుతాయి.

Marriages

నేను సమాజంలో పెద్దవాడిని కాకపోయినా, పెద్దవారనుకునేవారితో ఎక్కువగా తిరుగుతుండడంవల్ల వాళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటారు. చాలాసార్లు నాకెందుకో ఆదేశించినట్లుగా అన్వయమవుతూ ఉంటుంది. ధ్వని అర్థం చేసుకోలేక తప్పు నాదే కావచ్చు. పెద్దవారి పెళ్లిళ్లు ఊరికి దూరంగా జరుగుతూ ఉంటాయి. కటికచీకటిలో దారితప్పిన యాత్రికుల్లా రోడ్డుమీద కనపడ్డ ప్రతివారినీ అడ్రెస్ అడుక్కుంటూ ఆ ఫంక్షన్ హాల్లోకి ప్రవేశిస్తాను. బౌన్సర్లు, సాయుధ బాడీ గార్డులు, మెటల్ డిటెక్టర్లు చూడగానే అమెరికా రక్షణ ప్రధాన రహస్య కార్యాలయకేంద్రం పెంటగాన్ లోకి ప్రవేశించిన భయంతో కూడిన ఆందోళన మొదలవుతుంది. జాతరలో తప్పిపోయిన మనుషుల్లా అందరూ సెల్ ఫోన్లలో ఎవరు ఏ మూల ఇరుక్కుపోయారో చెప్పుకుంటూ ఉంటారు. ఈలోపు నన్ను గుర్తుపట్టి వేదికమీదికి నన్ను ఎత్తుకెళ్లగలిగే బాహుబలికోసం నేను దిగులు దిగులుగా చూస్తూ ఉంటాను. అదృష్టం బాగున్నప్పుడు ఎవరో ఒకరు దొరుకుతారు. లేనప్పుడు ఫంక్షన్ హాల్ గేటుకే నేను వచ్చినట్లు చెప్పి మర్యాదగా వెనక్కు వచ్చేస్తాను.

సోమాలియాలో అన్నార్థులకు ఐక్యరాజ్యసమితి ఆహార పొట్లాలను పంచుతుంటే దీనంగా క్యూలో నిలుచున్నట్లు బఫే భోజనం దగ్గర ప్లేట్ల కోసం నిలుచుంటాను. కొంత సహజమయిన పెనుగులాట తరువాత ప్లేటు దొరుకుతుంది. అందులోకి ఆహారం ముష్ఠి వేయించుకోవడానికి మళ్లీ క్యూలో నిలుచోవాలి. ఆ పింగాణీ ప్లేటే అయిదు కే జి ల బరువు. ఇకదానిమీద రెండు కే జీ ల ఆహారం మోపడం ఎందుకని నాలుగుమెతుకులు అన్నం , కొంచెం పెరుగు వేసుకుని రెండోసారి బఫే లైన్లో నిలుచోవాల్సిన దుర్గతి రాకుండా మేనేజ్ చేస్తాను. లేదా అసలు పెద్దల పెళ్లిళ్లల్లో ప్లేటు పట్టుకునే సాహసమే చేయకుండా ఇంటికొచ్చి తింటాను. ఆ మధ్య ఒకాయన వాళ్ళింట్లో పెళ్ళిలో అయిదువేల మంది తిన్నారని తృప్తిగా చెప్పాడు. ఆ పెళ్ళిలోనే నాకు మెతుకు దొరకక రాత్రి పదకొండు గంటలప్పుడు ఇంటికొచ్చి పెరుగన్నం తిన్నా. అంటే ఆయన లెక్క తప్పని కాదు. నా లెక్క తప్పిందని.

నూతన వధూవరులను ఆశీర్వదించడానికి పెద్దల పెళ్ళిళ్ళల్లో ఒక కిలోమీటర్ కు తక్కువ కాకుండా క్యూ ఉంటుంది. ఆ క్యూ ఎప్పటికీ కదలదు. ఈలోపు ఇంకా పెద్దలు నేరుగా వచ్చి అక్షింతలు చల్లి ఫోటోలకు ఫోజులిచ్చి వెళుతుంటారు. ఇక్కడ కూడా తప్పు వాళ్లది కాదు- క్యూలో ఉన్న మనదే.

చాలాసార్లు నేను ఆ పందిట్లో ఆ క్షణం ఉన్నానని సాక్ష్యం చెప్పగల ఒకడిని చూసి అతడి కంట్లో పడి బతుకుజీవుడా అని వచ్చేస్తుంటాను. వందల, వేల మంది హాజరయ్యే పెళ్ళిళ్ళల్లో వేదికదాకా వెళ్ళడానికి, భోంచేయడానికి కొన్ని యుద్ధవిద్యలు తెలిసి ఉండాలి. కొంత నైపుణ్యం, విపరీతమయిన చొరవ ఉండాలి. కొంత నిస్సిగ్గుగా ఉండాలి. కొంత నిర్మొహమాటంగా ఉండాలి. మరీ పెద్దలు వారి ఇళ్లల్లో పెళ్లిళ్లకు వారితో తులతూగగలిగినవారిని మాత్రమే పిలవాలి అని కోరుకోవడం అధర్మం. వారి అభిమానం వారిది. కాదనకూడదు. అక్కడికి వెళ్ళాక పందిట్లో రోల్స్ రాయిస్ వాడిని వాడిమానానికి వాడిని వదిలేసి లింగులిటుకుమంటూ ఓలా క్యాబ్ లో దిగిన మనల్ను కౌగిలించుకోవాలనుకోవడం, సాదరంగా ఆహ్వానించాలనుకోవడం సహజన్యాయ సూత్రాల ప్రకారం అధర్మం. అంతంత పెద్ద వారితో వారు వేదికమీద రాసుకు పూసుకు తిరగాల్సి ఉన్నప్పుడు మనకు ప్లేటు ఒక్కటే దొరికిందా? ప్లేటు మెతుకులు కూడా దొరికాయా? అని పట్టించుకోవాలనుకోవడం అన్యాయం.

ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదికతో ఆ పెళ్లి దానికదిగా ఒక అద్భుతం. ఆశ్చర్యం. సందడి. మెరుపు. తళుకు. కులుకు.

అక్కడ ఆ క్షణం మనం ఉండడం కోటి జన్మల పుణ్యఫలం. మనల్ను పిలవడం వారి ఔదార్యం.

అన్నం, సున్నం, ఆకు వక్క, అతిథి మర్యాదలు, కొసరి కొసరి వడ్డించడాలు, తాంబూలాలు అన్ని చోట్లా ఆశించకూడదు.

పిలిచారా? వెళ్లామా?వచ్చామా? అంతే

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి: 

కాలంతోపాటు మారాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com