Thursday, April 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది

Traffic satires:  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నది మాజీ ముఖ్యమంత్రి సతీమణి వాదన. అరే…! ఈరోజుకిదే గొప్ప (అ)శాస్త్రీయమైన పలుకన్నది అధికారపార్టీ మహిళా ఎంపీ సెటైరికల్ కౌంటర్. మొత్తంగా… అంత పెద్ద సోషల్ మీడియా చర్చకు తెరలేపాయి ఆర్థిక రాజధాని ముంబై రోడ్లు.

రోడ్లను సాధారణంగా ప్రగతి సూచికలుగా చెబుతుంటారు. ఓ ప్రాంతంలోకి వెళ్లగానే అక్కడ అద్దాల్లా కనిపించే రోడ్లే అక్కడ చోటుచేసుకుంటున్న ప్రగతికీ, అభివృద్ధికి బాటలన్నట్టుగా ప్రతిబింబిస్తుంటాయి. సరే రోడ్లు మాత్రమే బాగుండి పైన పటారంగా లోన లొటారంగా అభివృద్ధే లేకుండా ఉండొద్దన్నదీ ఏమీ లేదనుకోండి. కానీ… ఓ అందమైన, విశాలమైన, స్వచ్ఛమైన, గుంతల్లేని రోడ్డు  ఓ ప్రాంత అభివృద్ధికి ఓ సింబాలిక్ గెశ్చర్. అందుకే మాజీ ప్రధాని వాజ్ పేయ్ హయాంలో స్వర్ణ చతుర్భుజి  ఇప్పటికీ దేశంలో ఓ  మాడల్ ప్రాజెక్ట్!

సరే, అసలు రోడ్లేంటి…? ప్రగతేంటి…? అభివృద్ధేంటి…? మాజీ ముఖ్యమంత్రి భార్యేంటి…? ఎంకి పెళ్లి సుబ్బి చావుకు కారణమేంటి…? అందుకు ఎక్స్ సీఎం సతీమణిపై అధికారపార్టీకి చెందిన మరో ఎంపీ కౌంటర్లేంటీ…? అసలు మొత్తంగా మూడో పేరా వరకూ చదివినా అర్థం కాని ఈ కన్ఫ్యూజనేంటనేగా…?

మారుమూల గుడిసెలోనో… కాకులు దూరని కారడవుల్లోని గిరిజన గూడెంలోనో… ఎవ్వరైనా ఇట్టే ఆకర్షణకు లోనయ్యేలా మాట్లాడటం రాజకీయాల్లో ఒక కళైతే… అలాంటి కళాకారులూ ఈరోజుల్లో అరుదే! ఎందుకంటే తాము చెప్పాలన్న విషయాన్ని సూటిగా చెప్పలేక… మెదట్లో ఉన్న భావాన్ని వాక్యాల్లో వ్యక్తపర్చలేక… భావం కోసం భాష చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ… చెప్పిందే చెబుతూ అటు పబ్లిక్ మీటింగైనా, ఇటు ప్రెస్ మీటైనా ఇంకెప్పుడు ఆపుతారా అన్నట్టుగా మాట్లాడే వాక్’చతురులే’ ఎక్కువ!! అయితే, ఈ మొదటి రకం గురించిప్పుడు మనకిక్కడ అవసరం. ఏది మాట్లాడినా… తమదైన లాజిక్కుతో… కాకి ముక్కుకు, దొండపండుకూ ముడిపెట్టి… అర్థం కాని రీతిలో వ్యంగ్యాస్త్రాలుగా సంధించేవారు రెండోరకం. దీనికి కొంచెం మేథస్సవసరమనుకోండి! కానీ, అదే కాస్తా శృతి మించినప్పుడు అతితెలివని కూడా అనబడుతోంది!! మనమిప్పుడు చెప్పుకోబోయేది అతితెలివా.. మేథస్సా… అతితెలివితో సంధించిన వ్యంగ్యాస్త్రమా… లేక వాళ్లకు వాళ్లు మేథస్సుతో సంధిస్తున్నామని భావించిన ఛమక్కా, ఛలోక్తా అన్నది… మీకు మీరు అన్వయించుకున్నదాన్ని బట్టి అర్థాన్నిస్తుంది.

అవునూ, ఇక విషయానికొస్తే దేశ రాజధానైన ముంబైలో ట్రాఫిక్ సమస్య వల్ల 3 శాతం విడాకులవుతున్నాయన్న ఈ ముచ్చటే ఇప్పుడు మనం ఇంతసేపూ చెప్పుకున్న ఉపోద్ఘాతానికి ఓ కారణం! ఇది మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్యామణి అమృత ఫడ్నవీస్ నోట.. అధికారపక్షమైన శివసేన పాలనను లక్ష్యంగా చేసుకుంటూ.. జాలువారి సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ తెగనానుతున్న ఓ ప్రధాన ఆరోపణ. ఏంటీ ఇంతకూ మరి రోడ్లు బాగాలేకపోతే విడాకులవ్వడమేంటనేగా… తలలు పట్టుకుంటున్నది…? ఎవరి లాజికల్ థింకింగ్ స్టైల్ వాళ్లది! అమృత కూడా అలాంటి అనుభవాన్నెదుర్కొంది కాబట్టే… అనుభవంలోకొచ్చి భ్రమలు తొలిగి ఆమె ఆ కామెంట్స్ చేసుంటుందనుకునే అనుకూలురూ కొల్లలు.

ముంబైలో గుంతలు పడ్డ రోడ్లల్లో ప్రయాణాలు చేయలేక… రోడ్డు మీదికొచ్చినోళ్లు అధిక సమయం రోడ్ల మీదనే, ట్రాఫిక్ జామ్ లోనే చిక్కుకుపోయి.. ఇళ్లకు అనుకున్న సమయాలకు చేరుకోలేక… ఇళ్లల్లో కుటుంబ కలహాలు చోటుచేసుకుని… ఏకంగా ఆ గొడవలు విడాకులకు కారణమవుతోందన్నది అమృత మాటల వెనుక మర్మం! అబ్బ… ఇంత నిగూడార్థం దాగుందా ఈ మాట వెనుకా అని ఉబుసుపోతున్నారా…? ఓహో.. ముంబైలో చోటుచేసుకుంటున్న భార్యా, భర్తల విడాకుల వెనుక రోడ్లే ప్రధాన కారణమా అని హాశ్చర్యపోతున్నారా..? ఇదీ.. మీ ఊహలకే అవకాశం కల్పించే ఓ పజిల్! ఎందుకంటే అమృత ట్విట్టర్ వ్యాఖ్యల తర్వాత… ఇలాంటి కామెంట్సే బొచ్చెడన్నీ ట్విట్టర్ నిండిపోయాయిగనుక.. కొంతమంది ఏకంగా రోడ్లు విడాకులకు కారణమా… అయితే ఆ విషయంపై అర్జంటుగా ఓ రీసెర్చ్ చేయాల్సిందేనంటూ కూడా కౌంటర్ ఎటాక్స్ ఇచ్చారుగనుక!!

ఆర్నెల్లల్లో వాళ్లు వీళ్లవుతారు… వీళ్లు వాళ్లవుతారు కలిసుంటే అని ఓ నానుడి. అలాంటిది రాజకీయాల్లోకి ఓ ఇంట్లో ఒక్కరెంటరైతే… మిగిలినవారికీ రాజకీయాలొంటబట్టవా ఏంటీ…? అందుకే బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… మెల్లిగా మహిళల్లో చైతన్యం తెచ్చే కామెంట్స్ ఓ సాటి మహిళే చేస్తే…? ఇదే ఇప్పుడు అధికారపార్టీ అయిన శివసేన అనుమానం..?? కానీ, ఇప్పటికిప్పుడే ముంబై మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీపై విమర్శలు గుప్పించేందుకే అమృత ఆ వ్యాఖ్యలు చేశారనీ… శివసేన చెప్పలేని పరిస్థితి! అందుకే అంతకుమించి సామాన్యులకర్థం కాని… మేథోపరమైన కౌంటర్ తో శివసేన అటాకింగ్ మొదలెట్టింది.

 Mumbai Traffic Problems

అదే సోషల్ మీడియా వేదికగా నవ్వుతున్న ఓ ఎమోజీనీ ట్యాగ్ చేస్తూ శివసేన మహిళా ఎంపీ అయిన ప్రియాంకా చతుర్వేది రంగంలోకి దిగి “అరే.. భలే భలే చెప్పారే! ఈరోజుకు ఇదే గొప్ప (అ) శాస్త్రీయమైన అంశం. బెంగళూరు కుటుంబాలు ఈ వార్తను మాత్రం అస్సలు చూడొద్దు.. మీకు పెళ్లిళ్లపైనే అసహ్యం పుడుతుంది” అంటూ సామాన్యులకే కాదు, కాసింత చదువుకున్నోళ్లూ తలగోక్కున్నా అర్థంకాని లెవల్లో అమృతను మించిన ప్రియాంక అన్నట్టుగా ట్వీటింది. అసలు రోడ్లకూ, విడాకులకు ముడిపెట్టి అమృత చేసే కామెంట్స్ తోనే అర్థం కాక ఛస్తుంటే… ముంబై రోడ్లకూ, బెంగళూరు కుటుంబీకులకు ఈ ఎంపీ ప్రియాంకెందుకు ముడిపెట్టిందబ్బా? ఇదింకా విప్పలేని పజిలై అప్పుడో, ఇప్పుడో ట్విట్టర్ ఓపెన్ చేసేవారు… దాన్ని మూసేసి ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంకు ఇలాగైనా దూరమైపోయామని ఇప్పుడూపిరి పీల్చుకుంటున్నారట!

మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో సదరు మహిళా నేతల తార్కిక రాజకీయాలను అర్థం చేసుకోవడం ఇప్పుడో బ్రహ్మవిద్య అని ఎందరనుకుంటున్నారో తెలియదుగానీ… అబ్బా భలే చెప్పారు సింబాలిక్ గా, కొత్తగా అనుకునేవారూ లేకపోలేదు. అందుకే ఈ ఇద్దరి ట్విట్టర్ సంభాషణ మన పత్రికల్లో మెదడుకు మేతలాంటి పజిల్ బాక్సై.. బుర్రలకు పదును పెడుతున్న ఓ హాట్ టాపిక్!

-రమణ కొంటికర్ల

ఇవి కూడా చదవండి:  

ఇది విడాకుల వేళయని…

RELATED ARTICLES

Most Popular

న్యూస్