Another Bio-pic: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దుబిడ్డ, దొడ్డి కొమరయ్యపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో నేడు లాంచనంగా ప్రారంభమైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గడీలో ప్రారంభమైన ఈ వేడుకలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. వీఆర్ ఇంటర్నేషనల్.inc పతాకంపై మురళి దర్శకత్వంలో, వీరారెడ్డి, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నిర్మాణ సారథ్యంలో ఈ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మితమవుతోంది.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ “తెలంగాణ ఉద్యమానికి ముందు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులయ్యారని, వారిలో దొడ్డి కొమరయ్య మొదటివాడని గుర్తు చేసుకున్నారు. కడవెండి లో సంఘం మీటింగ్ జరుగుతుండగా, రజాకార్లు జరిపిన కాల్పుల్లో కొమరయ్య అమరుడయ్యరని, ఆయన పోరాట తత్వం, అలాంటి ఎందరో త్యాగాల స్ఫూర్తి తోనే సీఎం కెసిఆర్ తెలంగాణను సాధించారని వివరించారు. మనకు, మన ముందు తరాల వారికి ఆనాటి పోరాట యోధుల జీవిత చరిత్రలు తెలియాల్సి ఉందన్నారు. దొడ్డి కొమరయ్య చరిత్ర పై సినిమా తీయడం అభినందనీయమన్నారు. నిర్మాతలకు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.