Sunday, April 13, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు వెలుగుకోసం

తెలుగు వెలుగుకోసం

అంతులేని ఆ బంగాళాఖాతం అలల పక్కన… కైలాసగిరి నుండి డాల్ఫిన్ నోస్ కొండ వరకూ… ఏ అర్జునుడో లాగిపెట్టి బాణం వేస్తే వెళ్ళే సరళరేఖలా… రామకృష్ణ పరమ హంస పేరుతో ఉన్న ఆర్ కే బీచ్ ని ఓ వేకువ వేళలో ఎప్పుడైనా చూశారా?

ప్రతి ఉదయం చాలా మంది విశాఖ వాసులకు- ఇక్కడ పుట్టడం ఏ జన్మ పుణ్యమో అనిపిస్తూ…
ఇక్కడ బతకడం ఈ జన్మ ధన్యమే అనిపిస్తూ వీచే చల్లని గాలుల్లో ఆ ఉదయపు నడకలు ఓ ఆనంద జీవన పయనం.

అది ప్రతీ రోజు ఎంతో మంది ఎదురు చూసే ఆహ్లాద సమయం.
పక్కన కెరటాలు వినిపించే ఆ సాగరఘోష ఓ నిశ్శబ్ద వేదం పాడుతుంటే…
ఓ మూలగా నింగీ- నీళ్ళ మధ్యనుండి భూమి నుదుట బొట్టు పెట్టడానికి పైకి వచ్చే ఆ ఎర్రటి భానుడి వెలుగు రేఖ-
ఎన్ని మనసులను రంజింప చేస్తుందో!
ఎన్ని కనులలో వేకువ వెలుగులు తెస్తుందో!
ఎన్ని కాళ్ళకు నవ్వుతూ నడవమని శక్తిని ప్రసాదిస్తుందో!
బుడి బుడి అడుగులు వేసే బుజ్జి బుజ్జి పిల్లల నుండీ దాదాపు బతుకు మొత్తం చూసేసిన పండుటాకుల వరకూ ప్రతిరోజా ఆ ప్రదేశం ఓ ఆనంద ఎగసిపడే జాతర.
5 గంటల నుండి 7 గంటల వరకూ సైకిల్ తప్ప ఏ వాహనాలకూ అనుమతి లేకపోవడం వల్ల ఏ భయాలూ లేక నచ్చినట్టు నడిచే ఆ ప్రదేశంలో …
“మీకు తెలుగు రాదా?”  అంటూ ప్రశ్నించే ఓ భాషా ప్రేమికుడు… వైద్యం చదివిన డాక్టరు అట.
చిన్నప్పుడు ఏ అందమైన వాఙ్మయం చదివారో…
ఏ అద్భుత కావ్యాలు పఠించారో తెలియదు గానీ…ఆపై జీవన భృతికై ఆంగ్లంలో శరీర నిర్మాణాన్ని .. జీవకణ విశ్లేషణాన్ని చదివిన ఆ వైద్యుడు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పని చేసి… ఉద్యోగ విరమణ చేసి...ఇంతవరకూ మానవుని ఉదరకోశ జబ్బులు తగ్గించిన నేను, మారుతున్న కాలంలో పరభాషా మోజులో కొట్టుకుపోతున్న ఈ మనుషుల పిచ్చిని కాస్త సంస్కరించాలని బయలుదేరారేమో!

“తెలుగులో అనండంటూ…
తెలుగునూ వినండంటూ….
మన భాషా సౌందర్యాన్ని కనండంటూ… “ తెలుగు భాషపై తనకున్న ప్రేమను
తన బట్టలపై నలుగురి చూపూ పడేట్టు రాయించుకుని, ఈ వందల మందిలో ఏ కొందరైనా తనలా ఆలోచించక పోతారా?
ఓ పదిమందైనా ఆచరించకపోతారా ?
అనే ఆ సముద్రమంత ఆశ అతడిని ఇలా నడిపిస్తుందేమో!

అరవై యేళ్ళ క్రితం గోదారి తీరంలో గడిచిన ఆ బాల్యం నేటి భాషా సాంస్కృతిక మార్పులను చూసిన బాధతో ఏదో ఒక ప్రయత్నం చేయకుండా నిలవనీయడం లేదేమో!

అందుకే జనాన్ని ఆపి అలవోకగా పద్యాలను పాడుతూ
పాత ప్రబంధాలను తెలుపుతూ
గొప్ప కవులను తలుస్తూ …ఆశువుగా చెప్పే నాలుగు తెలుగు మాటలలో మాధుర్యం…
ఇది మన తరతరాల వైభోగం…
దీన్నెందుకు వదులుకుంటున్నామని మనదైన ఓ గుర్తింపుకు ఎందుకు దూరమైపోతున్నామని ఆయన అడుగుతుంటే మనం సమాధానం లేక నవ్వేస్తున్నామేమో!

నిజమే కదా!
ఏ జాతికైనా వారి భాషే గుర్తింపు.
వారు పలికే మాటే తమదైన ఓ అందం.
ఆ పదాల కలయికలో వచ్చే శబ్దమే మనది కాని ప్రాంతంలో అయినా ఒక్క క్షణం మన ప్రమేయం లేకుండానే అటువైపు మన మెడలు తిప్పే మంత్రపుష్పం..

మరి… మనం పాశ్చాత్య మోజులో పడి తల్లి భాషను ఎందుకు దూరం చేసుకుంటున్నాం?
తెలుగు బాగా మాట్లాడగలిగీ,
సాటి తెలుగు వారితో ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడుతున్నాం? ఏవో తెచ్చిపెట్టుకున్న భేషజాలు ఎందుకు వదులుకోలేకపోతున్నాం?
మన భాషకు దగ్గరగా ఉంటూ కూడా జీవితంలో రాణించగలమని ఇంగ్లీషు పుస్తకాలలో వైద్యం నేర్చుకున్న ఈ వైద్యుడు నిరూపించలేదా?
భూమిపై దూర దేశాల్లో ఎన్నో వృత్తుల్లో ఉన్నా…మన భాషను ప్రేమిస్తూ తెలుగులోనే మాటాడుకుంటూ తద్వారా వచ్చే కొన్ని తరాల వరకైనా కాపాడుకోవాలని ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న ఎంతో మందిని మనం చూడడం లేదా? మరి తెలుగు నేలలపై ఉన్న మన బుర్రలకెందుకీ తెగులు..?

నిజంగా మనిషి మేధస్సు సరిగా వికసితం అవ్వాలంటే మాతృభాషలోనే తొలి నాళ్ళలో చదవాలి.
అందుకే అభివృద్ధి చెందిన ఫ్రాన్స్, ఇటలీ,జర్మనీ, చైనా, జపాన్, రష్యాలతో సహా ఏ దేశాన్ని చూసినా అక్కడి పిల్లల తొలి పాఠాలన్నీ వారి మాతృభాషలోనే బోధింపబడుతున్నాయి.
మరి వారి కంటే ఏ విద్యలో మనం మిన్నగా ఉన్నామని మనకీ పరభాషా వ్యామోహం?
ఏ నోబుల్ బహుతులు వారికంటే ఎక్కువ పొందుతున్నామని మనకు మన భాషపై వ్యతిరేకం?
శాస్త్ర సాంకేతికతలో మన కంటే వారే ముందుండడం మనం చూస్తునే ఉన్నాం కదా!

అందుకేనేమో మనం మనది కాని దానిని అవసరమైన వరకే తీసుకుంటూ అభివృద్ధి మార్గంలో నడుద్దామనే ఈ డాక్టర్ ఈదర పెద్ద వీర్రాజుగారి చిన్న ఆశ
కొద్దిగానైనా నెరవేరాలని… దానికి మనందరి ఆలోచనలో కాస్తయినా మార్పు రావాలని కోరుకుంటూ….
మన కమ్మనైన అమ్మ భాషతో…మన తేనెలూరు తెలుగు మాటతో…
ఓ అందమైన అజంత బాటలో నడవడానికి ప్రయత్నిద్దామా… ఇక నుండి.

-కిలపర్తి త్రినాధ్
9440886844

RELATED ARTICLES

Most Popular

న్యూస్