Sunday, January 19, 2025
HomeTrending Newsపాక్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు

పాక్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు

పాకిస్తాన్ పార్లమెంటులో ఈ రోజు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ అసెంబ్లీ ప్రారంభం కాగానే పాకిస్తాన్ లో అంతర్జాతీయ కుట్రపై చర్చ చేపట్టాలని స్పీకర్ అసద్ కైజర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అవిశ్వాస తీర్మానం చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష నేత షేబాజ్ షరీఫ్ మాట్లాడుతూ స్పీకర్ చర్య కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని, వెంటనే అవిశ్వాస తీర్మానం మొదటి అంశంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.

జాతీయ అసెంబ్లీ ఈ రోజు అజెండాలో అవిశ్వాసం నాలుగో అంశంగా ఉంది. అజెండా ప్రకారమే ముందుకు వెళ్దామని స్పీకర్ స్పష్టం చేయటంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ రోజు అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్, కొత్త ప్రధాని ఎన్నిక జరగాలి. అయితే అంతర్జాతీయ కుట్ర, అవిశ్వాసం మీద ఎక్కువ సేపు మాట్లాడాలని పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ తన పార్టీ ఎంపిలకు అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చింది.  సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘిస్తే స్పీకర్ అసద్ కైజర్ పై ఐదేళ్ళ పాటు ఏ పదవికి చేపట్టకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు పడనుంది. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి స్పీకర్ పరిస్థితి ఉంది.

Pakistan Supreme Court Judgement

ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాసం చర్చకు రాకుండా చేస్తున్నారని స్పీకర్ అసద్ కైజర్, డిప్యూటీ స్పీకర్ కాసిం సురిపై విపక్షాలు అవిశ్వాసం ప్రవేశపెట్టాయి. అయితే రేపటిలోగా అవిశ్వాసం చర్చకు రావచ్చని జాతీయ అసెంబ్లీ అధికార వర్గాలు చెపుతుండగా వారం రోజుల వరకు చర్చకు రాదనీ అధికార పార్టీ నేతలు అంటున్నారు. అవిశ్వాసం తేలేవరకు దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉంది. ఎలాంటి అల్లర్లు జరగకుండా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున మిలిటరీ బలగాలు మొహరించారు.

వాస్తవానికి పాకిస్తాన్ పార్లమెంట్ గడువు వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఉంది. దీన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా రద్దు చేసి మూడు నెలల్లో ఎన్నికలకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో వాటిపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్రధాని ఎన్నికలపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. అయితే ప్రధాని ఇమ్రాన్ గద్దెదిగితే ఆయనపై నైతికంగా కూడా విజయం సాధించే విపక్షాల ప్రధాని కూడా ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమకు ప్రజల్లో పెరిగిన మద్దతును అవకాశంగా మార్చుకోవాలనేది విపక్షాల ఎత్తుగడగా కనిపిస్తోంది. అదే జరిగితే ముందస్తు ఎన్నికలు ఖాయం. అలాగే విపక్షాలు నిలబెట్టిన ప్రధానమంత్రి కూడా బలపరీక్షలో విఫలమైనా ముందస్తు ఎన్నికలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

Also Read : పాక్ తదుపరి ప్రధాని షాబాజ్ షరీఫ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్