తాగడం, తాగుడు, తాగుబోతు లాంటి మాటల వ్యుత్పత్తి ప్రకారం చూస్తే అందులో నిందార్థం, నీచార్థం ఉండనే ఉండదు. నీళ్లయినా, మద్యమయినా తాగాల్సిందే. కానీ నీళ్లను ఎవరూ పుచ్చుకోరు. నీళ్లను ఎవరూ కొట్టరు. అదే మద్యం అయితే పుచ్చుకుంటారు. ఆ మద్యం ముందుగా కొడతారు. బహుశా సీసా మూత తీయడానికి ముందు తట్టి, కొట్టి… ప్రారంభించడం వల్ల “మందు కొట్టడం” మాట పుట్టి ఉండాలి. కొన్ని వేల మందు పార్టీల్లో కూర్చునే అవకాశం నాకు దొరికినా…ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యం “మందు” ఎలా అయ్యింది? ఆ మందును తాగకుండా కొట్టడం ఏమిటి? అని వ్యుత్పత్తి, ప్రతిపదార్థాలను అడిగే అవకాశం మాత్రం ఎవరూ ఇవ్వలేదు. శుభమా అని మందు కొడుతుంటే… అశుభమయిన భాషాశాస్త్ర విషయాలు మొదలుపెడతావా? అని కొందరు నామీద ప్రేమతో బాటిల్ తో దాడి చేయబోయారు కూడా. ఆ మందు పార్టీల్లో ఫ్రూట్ జ్యూసులు తాగలేక, స్నాక్స్ తినలేక నేను బాధపడుతుంటే…వారు నన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతుంటారు. ఏ మాటకామాట. తాగిన తరువాత వారు వ్యక్త పరిచే అవ్యాజమయిన ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఏదయినా దూది పింజతో సమానం.
మాదక ద్రవ్యాలు, మద్యపానీయాలు యుగయుగాలుగా ఉన్నాయి. నేలకు అనకుండా గాల్లో తేలుతూ ఉండే రావణాసురుడి పుష్పక విమాన సువిశాల సౌధం బార్ కౌంటర్లో ఎన్ని రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉండేవో లెక్కే లేదు. సురాపానానికి ఒక ఉదాత్తతను ఆపాదించిన కథలు కోకొల్లలు.
ఇప్పటి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సీరీస్…అన్నిట్లో “మద్యం ఆరోగ్యానికి హానికరం” అన్న స్టాచుటరీ హెచ్చరిక సాక్షిగా మద్యం ఏరులై పారుతూనే ఉంటుంది. చిన్నా పెద్ద, రాజు పేద, స్త్రీపురుష భేదం లేకుండా ఇప్పుడు సమాజం తాగడంలో సమానత్వాన్ని సాధించింది. ఇదొక మహా మద్యోదయం. ఇదొక మత్తోదయం.
ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మంచి నీళ్ల బడ్జెట్ కంటే మద్యం మీద ఖర్చు కనీసం మూడు, నాలుగు రెట్లు అధికం. కొన్ని రాష్ట్రాలకు మద్యమే ప్రధానమయిన ఆదాయ వనరు. ఇందులో మంచి చెడ్డల గురించి మాట్లాడ్డం దండగ. మద్యం దానికదిగా ఒక పండగ.
మహా నగరాల్లో పగలూ రాత్రి తాగేవారు తాగుతూ ఊగుతూ జోగుతూనే ఉంటారు. తాగి నడిపి ప్రమాదాలు చేసేవారు చేస్తూనే ఉంటారు. మధ్యలో అమాయకులు పోయేవారు పోతూనే ఉంటారు. ఉండేవారు తాగేవారు పెట్టే బాధలు భరించలేక ఎప్పుడు పోతారో తెలియక ఉంటూ ఉంటారు.
బాధలు మరచిపోవడానికి తాగేవారు; బాధ పెట్టడానికి తాగేవారు; బాధపడడానికి తాగేవారు; ఆనందం పట్టలేక తాగేవారు; ఆనందం కోసం తాగేవారు; మర్యాద కోసం తాగేవారు; మర్యాదగా తాగేవారు; అమర్యాదగా తాగేవారు; ఏమీ తోచక తాగేవారు, వ్యసనంగా తాగేవారు, ఎందుకు తాగుతున్నారో తెలియక తాగేవారు…ఇలా ఈ లిస్ట్ కు అంతులేదు. వీకెండ్ తాగకపోతే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెను గౌరవించి ఎక్కువ మంది వీకెండే ఎక్కువగా మిక్కిలి మక్కువగా తాగుతూ ఉంటారు.
ఇలా ఇన్ని రకాలుగా, ఇన్నిన్ని సందర్భాలుగా, సందోహాలుగా, సరదాగా, వ్యసనంగా, నానా విధాలుగా తాగేవారికి తెలంగాణాలో పెద్ద చిక్కొచ్చి పడింది. బి ఆర్ ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఊరూ పేరూ లేని బీరు తాగాల్సివస్తోందట. అంతకుముందు మంచి రుచికరమైన మేలిరకం బ్రాండెడ్ బీరు తాగేవారట. బీరే కాకుండా ఇతర మద్యద్రవం బాటిళ్ల పేర్లు కూడా కొత్త కొత్తవి కనిపిస్తున్నాయట. దాంతో తమకు అలవాటైన ఉత్తమోత్తమ బాటిళ్లు అమ్ముతారా? లేదా? అని బాధ్యతగల తాగుబోతులు లిక్కర్ షాపులముందు ప్రజాస్వామిక పద్ధతిలో గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాగుబోతులకు మంచీ మర్యాద ఏమీ ఉండవని లోకం అనవసరంగా ఆడిపోసుకుంటుంది. వీరు చూడండి! ఎంత పద్ధతిగా, మర్యాదగా ప్రజాస్వామిక విధానంలో నిరసన వ్యక్తం చేస్తున్నారో? ఎంత తాగినా, ఎంతగా తూలి ఊగినా, మాట మడతపడి దొర్లినా…ప్రజాస్వామ్య స్ఫూర్తి మన నరనరాన జీర్ణించుకుపోయింది. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ!
తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే డి జె చప్పుళ్లకు ఎగురుతూ తాగడం- సందర్భాలను తెలిపేవి. నిజానికి తాగడానికి ఒక సందర్భం అంటూ ప్రత్యేకంగా ఉండదు. తాగడమే దానికదిగా ఒక సందర్భం. తాగడాన్ని వ్యాకరణం కూడా సరిగ్గా పట్టుకోలేదు. ఒక్కొక్క చుక్క కిక్కుగా ఎక్కే కొద్దీ భాష తడబడుతుంది. వ్యాకరణం మూగబోతుంది. భాషా శాస్త్రవేత్తలు, భాషోత్పత్తి శాస్త్రవేత్తలు సరిగ్గా దృష్టి పెడితే- తాగుబోతుల భాష, వ్యక్తీకరణ, అందులో అంతర్గతంగా ఇమిడి ఉన్న ప్రత్యేకమయిన వ్యాకరణం, ఉచ్చారణ భేదాల్లాంటి ఎన్నో భాషాపరమయిన వినూత్న విషయాలు తెలిసేవి. తాగుబోతులకు- భాషకు; తాగుబోతులకు- ఆర్థిక రంగానికి; తాగుబోతులకు- సమాజ శ్రేయస్సుకు ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాల మీద జరగాల్సినంత పరిశోధనలు జరగకపోవడం సమాజానికే వెలితి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు