ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. మెయిటీ, కుకీ తెగల మధ్య మే 3వ తేదీన చోటు చేసుకున్న ఘర్షణలతో మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో సుమారు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అల్లర్ల కారణంగా ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. కాగా, తాజాగా ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
అల్లర్ల దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ట్రక్కులను రాష్ట్రానికి నడిపేందుకు డ్రైవర్లు, యజమానులు ముందుకు రావడం లేదు. ఫలితంగా పలు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బియ్యం, బంగాళదుంప, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో రూ.900గా ఉన్న 50 కిలోల బియ్యం.. ఇప్పుడు రెట్టింపై రూ.1,800లకు చేరింది. రాజధాని ఇంఫాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ.170 అయ్యింది. గ్యాస్ సిలిండర్ రూ. 1,800కు అమ్ముతున్నారు.
ఇక కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణంగా రూ.180గా ఉన్న 30 గుడ్ల ఒక క్రేట్ ధర .. అల్లర్ల అనంతరం రూ.300కి పెరిగింది. ఈ లెక్కన ఒక్కో గుడ్డు ధర రూ.10 పలుకుతోంది. ఇక బంగాళదుంపలు కూడా కిలో రూ.100కు చేరినట్లు స్థానికులు వాపోతున్నారు. మరోవైపు అల్లర్ల ప్రభావం లేని జిల్లాల్లోనూ నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి.