ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం వణికించింది. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో గురువారం ఉదయం భూమి కంపించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.5గా నమోదైనట్లు వెల్లడించింది. భయకంపితులైన ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. దేశ రాజధాని మనీలాకు 124 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని తెలిపారు.అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మకటి జిల్లాలోని ఫైనాన్సియల్ ప్రాంతంలోని కంపెనీల నుంచి ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన దృశ్యాలు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేశాయి.