అండమాన్ నికోబార్ దీవులలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రాజధాని పోర్ట్‌బ్లేర్‌కు తూర్పు-ఈశాన్యంగా 106 కి.మీ దూరంలో ఉదయం 6.59 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంపం లోతు భూమికి 70 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో కూడిన భూకంపం ప్రాణాంతకంగా పరిగణించబడదు. అయితే.. భూకంప కేంద్రం తక్కువ లోతులో, సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉంటే..ప్రమాద తీవ్రత పెరుగుతుంది. 24 గంటల్లో.. ఒకే ప్రాంతంలో రెండో సారి భూప్రకంపనలు సంభవించడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు నివేదించలేదు. భూకంపం వల్ల ఏమైనా నష్టం జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు అన్ని ప్రాంతాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.