జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది. కత్రాకు 87 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది. అంతా నిద్రలో ఉండగా భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
గత నెలలో కూడా కశ్మీర్‌లో భూమి కంపించింది. జనవరి 9న రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయి. జనవరి 1 నుంచి 9 వరకు మూడుసార్లు భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.