Earthquake In Japan :
జపాన్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్‌లోని పుకుషిమా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం వాటిల్లింది. దీని ప్రభావంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:36కి భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈశాన్య తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అలలు ఒక మీటర్ ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు.
సముద్రానికి 60 కి.మీ. దిగువన భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదే ప్రాంతంలో 2011లో 9.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు సునామీ వచ్చింది. దాని ప్రభావంతో అణు ధార్మిక ప్లాంట్ లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికే 11 ఏళ్లు పూర్తైంది. ఇటీవలనే ఈ 11 ఏళ్ల ఘటనను ఈ ప్రాంత వాసులు గుర్తు చేసుకొన్నారు.
మియాగి, పుకుషిమా ప్రిఫెక్చర్లలో ఒక మీటర్ వరకు సముద్రం ఉప్పెనకు గురైంది. ఫుకుషిమా నగరం నుంచి 297 కిలోమీటర్ల దూరంలోని రాజధాని టోక్యో నగరంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. టోక్యో ఎలక్ట్రిక పవర్ కంపెనీ నుంచి కాంటో రీజియన్ కు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో 20లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.