జమ్ముకశ్మీర్‌లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ రోజు (బుధవారం) ఉదయం 7.30 గంటలకు సిధ్రా ప్రాంతంలోని ఓ ట్రక్కులో నక్కిన ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారు అనేది గుర్తించాల్సి ఉందన్నారు.
కాశ్మీర్ తో పోలిస్తే జమ్మూ కొంత ప్రశాంతంగా ఉంటుంది. జమ్ములో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచారు. అభివృద్ధి కార్యక్రమాలతో మిగతా ప్రాంతాలతో పోటీ పడుతున్న జమ్ములో అశాంతి సృష్టించేందుకు వేర్పాటువాదులు విఫల యత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులను కట్టడి చేసి, వారి కదలికలపై సైనిక వర్గాలు అప్రమత్తంగా ఉండగా… నిఘావర్గాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాయి.
ఉధంపూర్ జిల్లాలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో 15 కిలోల ఐఈడీ, 400 గ్రాముల ఆర్డీఎక్స్, ఐదు డిటోనేటర్లు, 7.62 ఎంఎం కాట్రిడ్జ్‌లు ఏడింటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.